ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు రాజమౌళి. ఏకంగా ఆస్కార్ స్థాయికి చిత్రానికి తీసుకెళ్లి చరిత్ర సృష్టించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై మెరిసిన ఆర్ఆర్ఆర్ చిత్రం త్వరలో ఆస్కార్ అవార్డును కూడా సాధిస్తుందని చిత్ర బృందంతో పాటు యావత్ భారత్ దేశం ఆశగా ఎదురుచూస్తోంది. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయ్యింది ఆర్ఆర్ఆర్.ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది.
గోల్డెన్ గ్లోబ్‌తో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డు వేడుకల్లో సత్తా చాటింది ఆర్ఆర్ఆర్. అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకొని కొత్త చరిత్రను సృష్టించింది. తాజాగా అమెరికాకు చెందిన క్రిటిక్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ రెండు విభాగాల్లో పోటీకి సిద్ధమైంది. బెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌తో పాటు .బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ యాక్టర్ కేటీగిరీల్లో ఆర్ఆర్ఆర్ నామినేట్ అయింది. బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ యాక్టర్ అవార్డు కోసం రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు వేర్వేరుగా నామినేట్ అయ్యారు. దీంతో అవార్డు ఎవరికి వస్తుందన్నదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. దీనిపై మెగా, నందమూరి హీరోల మధ్య ఇప్పటికే చర్చ మొదలైంది. మా హీరో టాప్ అంటే మా హీరో టాప్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేపట్టారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించారు. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు.
ఈ ఆస్కార్ ఈవెంట్ కోసం రాజమౌళి, రామ్‌చరణ్ అమెరికా వెళ్లారు. హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ ఇచ్చే అవార్డుల వేడుకలకుగాను చరణ్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది.గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్ పాల్గొని అలరించారు. రేపు జరగనున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకలో ఆయన ప్రెజెంటర్ గా వ్యవహరించనున్నారు.