ఇండోనేసియాలో ఓ మొసలిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అది మానవత్వానికి ప్రతిరూపమని, క్రూరజంతువుల్లో అలాంటివి చాలా అరుదు అని తెగ పొగిడేస్తున్నారు. నీటిలో అడుగుపెట్టగానే బరబరా లెక్కెళ్లి గుటకాయ స్వాహా చేస్తాయని ఇండోనేసియా మొసళ్లకు పేరు. అలాంటిది, ఓ భయంకరమైన మొసలికి ఇలా నీరాజనాలు పట్టడం వింతే. నమ్మశక్యం కాని ఈ ఉద్వేగభరితమైన విషాదం మహకంలో ప్రాంతంలో తూర్పు కలిమంతన్ దీవుల్లో రెండు రోజుల కిందట జరిగింది.
మహమ్మద్ జియాద్ విజయ అనే నాలుగేళ్ల బాలుడు బోర్నియో నదిలో ఆడుకుంటూ ఆడుకుంటూ గల్లంతయ్యాడు. అతని కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. కనీసం మృతదేహమన్నా కనిపిస్తే అంత్యక్రియలు చేద్దామని తల్లిదండ్రులు అనుకున్నారు. ఇంతలో పదడుగుల భారీ మొసలి నదిలో అల్లంత దూరంలో ప్రత్యక్షమైంది. దాని వీపుపై విజయ నిర్జీవంగా కనిపించాడు. మొసలి తన వీపుపై ఆ బాలుడిని ఎంతో జాగ్రత్తగా మోస్తూ ఏకంగా 700 అడుగులు ప్రయాణించి బోటు దగ్గరికి వచ్చింది. బోటులోని జనం ఆ బాలుడి మృతదేహాన్ని అందుకోగానే మొసలి మళ్లీ నీటిలోకి వెళ్లిపోయింది. విజయ దేహంపై ఒక్క గాయం కూడా లేదని, అతని మృతికి మొసళ్లు కారణం కాదని, మునిగే చనిపోయి ఉంటాడని జనం చెప్పుకుంటున్నారు.