పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. తినే తిండిలో, కట్టే బట్టలో ఎంత వెరైటీగా ఉంటే జనాన్ని అంతగా కట్టిపడెయ్యొచ్చు. ఇక వేసుకునే నగల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఏడు వారాల నగలని.. వారంలో ఒక్కో రోజుకు ఒక్కో స్టైల్ నగలు కేవలం భారతదేశ మహిళలు మాత్రమే ధరిస్తారు. ఇక ఆ నగల డిజైన్లు, కథా కమామిషు సంగతి చెప్పాల్సిన పనేలేదు.
ఆడవారికి అందం తెచ్చే నగల్లో నెక్లెస్ ఒకటి. నెక్లెస్ అంటే పూలు, తీగలు, మామిడిపిందెలు, లక్ష్మీదేవత వంటి దేవతల బొమ్మలతో తయారైన హారాలు కళ్లముందు కదలాడతాయి. శతాబ్దాల నుంచి ఇలాంటి ఓల్డ్ నగలేనా అని ఓ నగల షాపువారికి విసుగొచ్చింది. ఎవరూ ఊహించని డిజైన్‌కు పురిగొల్పింది. రెండు మొసళ్ల బొమ్మలతో వజ్రాల నెక్లెస్ తయార్ చేశారు. ఒక మొసలి తన తలకాయను మరో మొసలి తలకాయపై పెట్టినట్లు డిజైన్ చేశారు. వజ్రపరిశ్రమకు పేరొందిన సూరత్‌లో జరుగుతున్న నగల ప్రదర్శనలో దీన్ని జనానికి చూపిస్తున్నారు.
మొత్తం 15వేల చిన్నచిన్న అసలైన వజ్రాలు, రత్నాలతో దీన్ని తయారు చేశామని వ్యాపారి సమీర్ మెహతా చెప్పారు. అన్నేసి వేల వజ్రాలంటే ఖరీదు ఎక్కువ ఉంటుందని అనుకుంటాం కదా. కానీ డబ్బున్నవాళ్ల దృష్టిలో అయితే అంత ఖరీదేం కాదులెండి, జస్ట్ 30 లక్షలేనట. ఇందులో 8 వేల వజ్రాలు, 7 వేల కలర్స్ స్టోన్స్ ఉన్నాయని బరువు 330 గ్రాములని మెహతా తెలిపారు. దీన్ని డిజైన్ చేయడానికి మూడు నెలలు, తయారు చేయడానికి రెండు నెలలు పట్టిందట