మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న చంబల్ నదీతీరం వద్ద స్నానం చేస్తున్న పదేళ్ల బాలుడిని భారీ మొసలి మింగేసింది. దీంతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు బాలుడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారంతా చేరి తాడు, కర్రలు, వల సహాయంతో నీట్లో ఉన్న మొసలిని బయటకు లాగి బంధించారు. విషయం తెలుసుకున్న మొసళ్ల సంరక్షణ విభాగం వారు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మొసలిని గ్రామస్థుల నుంచి రక్షించేందుకు ప్రయత్నించాయి. అయితే బాలుడి తరపు వాళ్లు అందుకు అంగీకరించలేదు. తమ బాలుడు మొసలి కడుపుతో బతికే ఉంటాడని, పొట్ట చీల్చి బాలుడిని వెలికితీయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ బిడ్డను మొసలి బయటకు పంపినప్పుడే వదులుతామని పట్టుబట్టారు. చివరకు పోలీసులు, మొసళ్ల అధికారులు నచ్చజెప్పి ఒప్పించడంతో గ్రామస్థులు శాంతించి మొసలిని విడిచిపెట్టేందుకు అంగీకరించారు.