ఇండోనేషియాలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. సముద్ర తీరంలో ఈత కొట్టి పడవపై కూర్చున్న వ్యక్తిని 13 అడుగుల మొసలి మింగేసింది. దాంతో ఆగ్రహించిన గ్రామస్థులు మొసలి కోసం సముద్రంలో వేట ప్రారంభించారు. ఎట్టకేలకు దానిని పట్టి బంధించి పొట్టకోసి చూడగా, షాకింగ్ విషయం బయటపడింది. జూన్ 28న జరిగిన ఈ ఘటన వివరాలు.. పాపువా ప్రావిన్స్‌లో నిర్మాణ కార్మికుడు బెర్నార్డ్ సముద్ర తీరంలో ఈత కొట్టి అలసిపోయి పడవపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఇంతలో భారీ మొసలి అతడిని పట్టుకొని నీటిలోకి లాగి మింగేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు సముద్రంలో మొసలి కోసం వేట ప్రారంభించగా, జూన్ 29న ఉబ్బిన కడుపుతో ఓ మొసలి వారి కంటపడింది. దాంతో అదే మనిషిని మింగేసిందని భావించి బంధించి ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం దాని పొట్ట కోసి చూడగా, అందులో మనిషి అవశేషాలు కనిపించాయి. మనిషి శరీరం దాదాపు జీర్ణించిపోగా, పుర్రె, ఎముకలు మాత్రమే మిగిలాయి. వాటిని నిర్ధారించడానికి పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, మొసలి పొట్టకోసి చంపిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.