కేసీఆర్ సర్కార్‌కు కాసుల పంట.. ఒక్క రోజులోనే - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సర్కార్‌కు కాసుల పంట.. ఒక్క రోజులోనే

June 8, 2022

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్‌కు మంగళవారం కాసుల వర్షం కురిసింది. ఒక్క రోజులోనే ఏకంగా రూ. 15.59 కోట్ల రూపాయలను తెలంగాణ ఆర్టీసీ ఆర్జించింది. ఈ స్థాయిలో ఆదాయం రావడం గత మూడు నెలల్లో ఇదే తొలిసారని ఆర్టీసీ అధికారులు వివరాలను వెల్లడించారు. ”మంగళవారం 34.69 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడిచాయి. అందులో మొత్తం 34.17 లక్షల మంది ప్రయాణం చేశారు. నిన్న రూ.13.64 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ, అదనంగా రూ.1.95 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా తర్వాత ఇంత భారీ మొత్తంలో ఆదాయం రావడం ఇది రెండోసారి” అని అధికారులు వివరాలను వెల్లడించారు.

మరోపక్క తెలంగాణ ఆర్టీసీ విషయంలో ఎండీ సజ్జనార్ కొత్త కొత్త ఆలోచనలతో ఆర్టీసీని ముందుకు తీసుకెళ్తున్నారు. దేవాలయాలకు, పండుగలకు, పరీక్షలకు, వేసవి సెలవులకు, జాతరలకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తూ, ప్రజలకు, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోజంతా మాతృమూర్తులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా ఆఫర్‌ను తీసుకొచ్చారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని, బస్ పాస్‌ల విషయంలో రాయితీలను తగ్గిస్తూ, నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కరోనా తర్వాత మంగళవారం రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి ఆర్టీసీ రూ. 15.59 కోట్లను సంపాదించి పెట్టింది. అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం రావడంతో అధికారులు తెగ ఉబ్బిపోతున్నారు.