ఉన్నట్టుండి పడిన వర్షం చాలా జిల్లాల మీద ప్రభావం చూపించింది. సుమారు 50 మండలాల్లో 650 గ్రామాలకు నష్టం జరిగిందని అంచనా. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో అత్యంత ఎక్కువగా పంటలు నష్టపోయాయని అధికారులు చెబుతున్నారు. అక్కడ పంటపొలాలన్నీ వడగళ్ళతో నిండిపోయాయి. రోడ్లన్నీ మయంగా మారిపోయి ఏదో శీతల ప్రాంతాన్ని తలపిస్తున్నాయని అంటున్నారు. దీంతో పంట చేతికందే పరిస్థితి లేదని రైతులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు.
టమాటా, బీర, మొక్కజొన్న, పర్చిమిర్చి, బొబ్బర్లు, మినుములు పంటలతో పాటూ మామిడి పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి పూత, పిందెలు రాలిపోయి రైతులు గగ్గోలు పెడుతున్నారు. నష్టపోయిన ప్రాంతాలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రర్యటించనున్నారు. మరోవైపు ఇలాగే మూడు రోజుల పాటూ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇక అటు ఆంధ్రాలోనూ వర్షాలు భారీగా పడుతున్నాయి. ఉత్తర తహిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణశాఖ చెబుతోంది. దీని ఫలితంగా మరో మూడు రోజుల పాటూ దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో చాలా చోట్ల వర్షాలు పడతాయని అంటున్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఈదురు గాలులు కూడా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు.