చితక్కొట్టిన కమిన్స్.. ఓడిన ముంబై - MicTv.in - Telugu News
mictv telugu

చితక్కొట్టిన కమిన్స్.. ఓడిన ముంబై

April 7, 2022

04

ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లు నువ్వా – నేనా అన్న రేంజ్‌లో రసవత్తరంగా జరుగుతున్నాయి. క్రికెట్ అభిమానుల అంచనాలను తారుమారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతరాత్రి కోల్‌కతా, ముంబైల మధ్య జరిగిన మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిపోయింది. కోల్‌కతా ఆటగాడు పేసర్ ప్యాట్ కమిన్స్ కళ్లు చెదిరిపోయే రీతిలో సిక్సర్ల మీద సిక్సర్లు, ఫోర్ల మీద ఫోర్లను కొట్టి, కేకేఆర్‌ను గెలిపించాడు. కేవలం 15 బంతుల్లో 58 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు.

వివరాల్లోకి వెళ్తే.. బుధవారం పుణె వేదికగా కోల్‌కతా, ముంబైల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కోల్‌కతా మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లకి నాలుగు వికెట్లు కోల్పోయి, 161 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 పరుగులు) అర్ధ శతకంతో రాణించగా, తిలక్‌ వర్మ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్‌), పొలార్డ్‌ (5 బంతుల్లో 3 సిక్సర్లతో 22 నాటౌట్‌) మెరుపులు మెరిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (3), ఇషాన్ కిషన్ (14), డెవాల్డ్ బ్రేవిస్ (29) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్..162 పరుగుల లక్ష్య ఛేదనలో తొలుత కొంత తడబడినప్పటికీ, ఆ తర్వాత కుదురుకుంది. కమిన్స్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. దీంతో 16 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెంకటేష్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్‌) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ముంబై బౌలర్లలో మురుగన్‌ అశ్విన్‌, మిల్స్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన కమిన్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ”కమిన్స్ ఇలా ఆడతాడని ఎప్పుడూ ఊహించలేదు. ఈ మ్యాచ్‌లో క్రెడిట్ మొత్తం అతడికే దక్కుతుంది. మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాట్స్ మెన్ చెలరేగేందుకు అనుకూలంగా పిచ్ మారింది. మొత్తంగా ఇది చాలా మంచి పిచ్. అయితే, మేం బ్యాటింగ్‌లో తొలుత సరిగ్గా ఆడలేకపోయాం. కానీ, చివరి 5 ఓవర్లలో 70కి పైగా పరుగులు సాధించాం. అదంతా మా బ్యాటింగ్ బృందం కృషి అని చెప్పొచ్చు. ఇక బౌలింగ్‌లో మా ప్రణాళికల పరంగా బౌలింగ్ చేయలేకపోయాం. కోల్‌కతా బ్యాటింగ్ చేసేటప్పుడు 15 ఓవర్ల దాకా పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత కమిన్స్ వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాడు.

మంచి పరుగులు సాధిస్తే, ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుంది. ఒక దశలో వారివి 5 వికెట్లు తీశాం. కానీ, వెంకట్, కమిన్స్‌లను ఔట్ చేయలేకపోవడమే మ్యాచ్‌ను దూరం చేసింది. ఈ ఓటమి జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇకపై మేం కష్టపడాల్సింది చాలా ఉంది. ఎప్పుడూ నాకు ఇలాంటి స్థితిలో ఉండాలని నచ్చదు’ అని రోహిత్ వివరించాడు.