క్యాస్ట్రోల శకం ముగిసింది.. తప్పుకున్న రౌల్ - MicTv.in - Telugu News
mictv telugu

క్యాస్ట్రోల శకం ముగిసింది.. తప్పుకున్న రౌల్

April 19, 2018

కమ్యూనిస్టు క్యూబాలో ఒక విశిష్ట శకం ముగిసిపోయింది. 60 ఏళ్ల క్యాస్ట్రోల పాలన గురువారం ముగిసింది. విప్లవ నేత, ఆధునిక క్యూబా నిర్మాత  ఫిడెల్‌ క్యాస్ట్రో పాలన తర్వాత 12 ఏళ్ల కిందట దేశాధ్యక్షుడి పగ్గాలు చేపట్టిన ఆయన తమ్ముడు రౌల్‌ క్యాస్ట్రో(86) అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అయితే కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఇకముందూ కొనసాగనున్నారు. రౌల్‌ క్యాస్ట్రో స్థానంలో కమ్యూనిస్టు పార్టీ స్టేట్‌ కౌన్సిల్‌ పార్టీకి అత్యంత విధేయుడైన మిగుల్‌ డియాజ్‌ కెనాల్‌ బెర్ముడెజ్‌ (58)ను ఎన్నుకున్నారు.

2008 వరకు క్యూబాను ఏలిన ఫిడెల్ 2006లో రౌల్‌కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. రౌల్ తన సోదరుడికి భిన్నంగా ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించారు. అమెరికాతో మైత్రి నెరిపారు. ఫలితంగా 2015లో నాటి అమెరికా అధినేత బరాక్‌ ఒబామా తొలిసారి క్యూబా గడ్డపై పర్యటించాడు. అయితే ట్రంప్ అగ్రరాజ్య పగ్గాలు చేపట్టాక మళ్లీ సంబంధాలకు ఆటంకం ఎదురైంది.