పెరిగిన నిత్యావసరాలు ధరలు తగ్గించాలని, అందరికీ ఆహారం, ఔషధం అందుబాటులో ఉంచాలంటూ ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారికి 25 ఏళ్ల పాటు శిక్ష విధించారు. కమ్యూనిస్ట్ దేశమైన క్యూబాలో గత ఏడాది వేసవిలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగిన 381 మందిని అదుపులోకి తీసుకున్నారు అక్కడి పోలీసులు. ప్రభుత్వం వారందరికీ శిక్ష విధించింది. అందులో కొందరికి 25 ఏళ్లపాటు శిక్ష ఖరారు చేసింది. అయితే ఇలా శిక్ష పడిన వారిలో 16 ఏళ్లలోపు పిల్లలు కూడా ఉన్నారు. క్యూబాలో ఇంత కఠినమైన శిక్ష విధించడం చర్చనీయాంశంగా మారింది.
ఆందోళనకారులపై దేశద్రోహం, పబ్లిక్ డిజార్డర్, దాడి లేదా దోపిడీ నేరాలపై జైలు శిక్ష విధించినట్టు అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది. పైగా ఈ అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉన్నట్టు క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్ కానెల్ ఆరోపించారు. అయితే ఈ ఆందోళనకారుల కేసు విచారణలో పారదర్శకత లేదని, అరెస్ట్ చేసిన వారిని రిలీజ్ చేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఎంతో పోరాటాల చరిత్ర ఉన్న క్యూబాలో విప్లవాన్ని విజయవంతం చేయడానికి చెగువేరా పోరాడారు. గత కొన్నేళ్ల క్రితం వరకు ఫిడేల్ కాస్ట్రోనే పాలన సాగించేవారు. ఆయన మరణాంతరం అతని సోదరుడు రావుల్ కాస్ట్రో చేతుల్లో పాలన వెళ్లింది.