అతనికి ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యిమంది ప్రియురాళ్లు. వాళ్లతో ఖుషీ ఖుషీ. మరోపక్క నేరసామ్రాజ్యం. కుట్రలు, కుతంత్రాలు, గూఢచర్యం, బ్లాక్ మెయిలింగ్.. మాటల్లో చెప్పలేని మరెన్నో ఘాతుకాలు. మొత్తానికి పాపం పడింది. అక్షరాలా 1075 ఏళ్ల జైలు శిక్ష పడింది. టర్కీకి చెందిన అద్నాన్ ఓక్తర్ అనే 64 ఏళ్ల గ్రంథసాంగుడి కథ ఇది. పది జన్మలెత్తినా తీరని జైలు శిక్ష పడిన ఈ దుర్మార్గుడి కథలు ఇన్నీ అన్నీ కావు.
వివిధ కేసుల్లో ఇతనికి ఇస్తాంబుల్ కోర్టు భారీ జైలు శిక్ష విధించింది. అద్నాన్ 1990లో ఓ కల్ట్ ఫిగర్. ధనిక యువతులతో పరిచయాలు పెంచుకుని ప్లేబాయ్లా మారాడు. జనాన్ని నమ్మించడానికి మత ప్రవచనాలు కూడా వల్లించేవాడు. మైనర్ బాలికలను కూడా దేవుడు, దయ్యం అని భయపెట్టి చెరపట్టేవాడు. అతనికి దేశవ్యాప్తంగా వేలమంది అనుచరులు తయారయ్యారు. అతని ఆకర్షణలో పడి అమ్మాయిలు దారుణంగా మోసపోయేవారు. అద్నాన్ వారిని అన్నిరకాలుగా దోచుకునేవాడు. అత్యాచారాలు చేసి వీడియోలు తీసి బెదిరించేవాడు. చిత్రహింసలు పెట్టి, గర్భస్రావాలు చేయించేవాడు. అంతేకాకుండా అందంగా కనిపించాలని వారికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించేవాడు. రాజకీయాల్లోనూ తలదూర్చి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించాడు. అర్థిక నేరాలకు లెక్కేలేదు. ఫతుల్లా అనే ఉగ్రవాద సంస్థకు భారీగా నిధులు సమకూర్చాడు. 2019లో పోలీసులు అద్నాన్తోపాటు అతని అనుచరులను వందల సంఖ్యలో అరెస్ట్ చేశారు.
అతని నేరాలను విచారించిన జడ్జీలు నోరు వెళ్లబెట్టారు. ప్రేమకు హద్దు లేదని, అందుకే తాను వెయ్యిమంది మహిళలతో ప్రేమాయణం నడిపానని అద్నాన్ చెప్పుకొచ్చాడు. తనకు గొప్ప శక్తులు ఉన్నాయని కారుకూతలు కూశాడు. ఓక్తర్తో అతని అనుచరుల కేసులపైనా విచారణ జరుగుతోంది.