గుంటూరులో నోట్ల కట్టల కలకలం.. బ్యాగులో రూ. 2.5 కోట్లు
గుంటూరులో కరెన్సీ బ్యాగ్ కనిపించడంతో గందరగోళానికి దారి తీసింది. వెంగళాయపాలెం వద్ద రోడ్డు పక్కనే డబ్బు మూటను గుర్తించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 2.5 కోట్ల విలువైన నోట్ల కట్టలు దర్శనం ఇచ్చాయి. పెద్ద ఎత్తున నగదు కనిపించడంతో స్థానికులు అయోమయంలో పడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నోట్లను చూసి పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో అన్ని 2వేలు, 500 కరెన్సీ అంతా కలిపి రెండు కోట్లపైనే ఉంది. దీంతో అవి ఎవరు వదిలి వెళ్లిపోయారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
రెండు వేల నోటుపై చిన్న పిల్లల కరెన్సీ అని ముద్రించి ఉండటం పోలీసులు గమనించారు. అవన్నీ నకిలీ నోట్లుగా తేలడంతో ఎవరో కావాలనే పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ బ్యాగును రోడ్డుపై ఎవరు వదిలి వెళ్లారనే కోణంలో ఆరా తీస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ దొరకడం జిల్లాలో సంచలనంగా మారింది. కాగా, ఇటీవలే నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేశారు. వరుస ఘటనలతో జనం భయపడిపోతున్నారు. నోట్లను పెద్ద నోట్లు తీసుకోవడానికి వెనకా ముందు ఆలోచిస్తున్నారు.