తెలంగాణకు మరికొద్ది రోజుల్లో కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్న తరుణంలో డీజీపీ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో భాగంగా ఐదుగురు అధికారుల జాబితాను ప్రభుత్వం యూపీఎస్పీకి ఇప్పటికే పంపింది. ఇందులో సీనియార్టీ ప్రాతిపదికన ముగ్గురి పేర్లను సూచించింది. అయితే డీజీపీ నియామకంపై మాత్రం సీఎం కేసీఆర్ దే తుది నిర్ణయం అవుతుంది. పోటీ పడుతున్న వారిలో సీనియార్టీ ప్రకారం చూస్తే ప్రస్తుత ఏసీబీ డీజీ అంజనీ కుమార్, హోం ప్రిన్సిపాల్ సెక్రటరీ రవి గుప్తాలు ముందు వరుసలో ఉన్నారు. అయితే స్థానికత ప్రాతిపదికన ఎంపిక చేయాలనుకుంటే ప్రస్తుత నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కి పదవి వరించే అవకాశం ఉంది.
సమయం తక్కువగా ఉండడంతో త్వరలోనే డీజీపీ నియామకంపై ప్రకటన వెలువడవచ్చని అంచనా. ఒకవేళ సాధ్యం కాని పక్షంలో ఇంఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ లేదా సీవీ ఆనంద్ లలో ఒకరిని నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. 22 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, 18 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించనున్నారని ఆ వార్తల సారాంశం. దీంతో పాటు ఖమ్మం, రామగుండం, కరీంనగర్ లకు కొత్త సీపీలను నియమించే అవకాశాలున్నాయి. దీనికి కేసీఆర్ ఇప్పటికే ఆమోదం తెలుపగా, బదిలీ ఉత్తర్వులు త్వరలో వెలువడతాయని, ఎన్నికల నేపథ్యంలోనే ఈ బదిలీలు ఉన్నాయని భోగట్టా.