మోదీ, దోవల్ ప్రాణాలకు ముప్పు!  కీలక కంప్యూటర్లపై సైబర్ దాడి  - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ, దోవల్ ప్రాణాలకు ముప్పు!  కీలక కంప్యూటర్లపై సైబర్ దాడి 

September 18, 2020

Cyber attack on NIC, MEITY computers storing data related to national security; Delhi Police launches probe

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ ప్రాణాలకు ముప్పు ఉందని  నేషనల్ ఇన్ఫర్మెటిక్ సెంటర్ గుర్తించింది. వారితో పాటు ఇతర కీలకమైన సమాచారం ఉండే కంప్యూటర్లపై సైబర్ దాడి జరిగినట్టు వెల్లడించింది. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీస్‌కు చెందిన స్పెషల్ సెల్ వెంటనే ఈ సైబర్ దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. బెంగళూరు నుంచి ఈ దాడి జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సైబర్ దాడి జరిగినట్టు బయటపడింది. మోదీ, అజిత్ ధోవల్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు, సంస్థలు, భారత పౌరులకు సంబంధించిన సమాచారం ఈ కంప్యూటర్లలో నిక్షిప్తం అయి ఉంటుంది. ప్రభుత్వానికి చెందిన ఇలాంటి కీలక సమాచారాన్ని భద్రపరచడం, రక్షించే పనిని నేషనల్ ఇన్ఫర్మెటిక్ సెంటర్ చూసుకుంటుంది.

నేషనల్ ఇన్ఫర్మెటిక్ సెంటర్ ఉద్యోగులకు ఈమెయిల్ పంపి ఈ సైబర్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు ఆ ఈమెయిల్ క్లిక్ చేయగానే కొంత డేటా కంప్యూటర్‌లో స్టోర్ అయింది. ఆ డేటా సాయంతో కంప్యూటర్ సిస్టమ్స్‌పై హ్యాకర్లు దాడి చేశారు. ఆ ఈమెయిల్ ఐడీ ఎక్కడినుంచి వచ్చిందని ఐపీ అడ్రస్ ద్వారా ఆరా తీశారు. బెంగళూరులో ఉన్న అమెరికాకు చెందిన కంపెనీ నుంచి వచ్చిందని తేలగా, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా,
చైనాకు చెందిన ఝెన్హువా డేటా ఇన్ఫర్మేషన్.. భారత ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఆర్మీ చీఫ్‌తో పాటు వేలాది మంది వీవీఐపీలపై రహస్యంగా నిఘా పెడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతలో ఇప్పుడు ఈ సైబర్ దాడి జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ఆరోపణలపై ప్రభుత్వం నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయగా.. 30 రోజుల్లో నివేదిక అందనుంది.