సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్తున్న నగరవాసులకు పోలీస్ శాఖ ఊరట కలిగించే వార్త చెప్పింది. ధైర్యంగా ఊరుకెళ్లి ఆనందంగా పండుగ జరుపుకోమని, మీ ఇళ్లను మేం చూసుకుంటామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర హామీ ఇచ్చారు. కమీషనరేట్ పరిధిలో ఉన్న అన్ని స్టేషన్ల అధికారులు, క్రైమ్స్ విభాగం అధికారులతో సీపీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ వేళ చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. జనాలు ఊర్లకు వెళ్తారు కాబట్టి ఇదే అదనుగా అంతర్రాష్ట్ర ముఠాలు, దొంగలు చేతివాటం ప్రదర్శిస్తాయని రాత్రి వేళ జరిగే చోరీల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నివాస ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్, గస్తీ ఏర్పాట్లను ముమ్మరం చేయాలని సూచించారు. అలాగే ప్రతీ పోలీస్ స్టేషనులో క్రైమ్ స్పాట్లలో సీసీటీవీలను ఏర్పాటు చేసి నిరంతంర నిఘా వేయాలని, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. అటు పౌరులు కూడా తమ నివాస ప్రాంగణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పాత నేరస్థుల, ఇటీవల జైలు నుంచి విడుదలైన వారిపై నిఘా వేయాలని, కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తూ నేరాలను నియంత్రించాలని పేర్కొన్నారు. అన్ని విభాగాలు కలిసికట్టుగా పని చేయాలని, సమన్వయ లోపం తలెత్తకుండా ఉండాలన్నారు.