సైబర్ నేరాలు ఎలా చేస్తారు? అడ్డుకోవడం ఎలా? - MicTv.in - Telugu News
mictv telugu

సైబర్ నేరాలు ఎలా చేస్తారు? అడ్డుకోవడం ఎలా?

February 9, 2021

02

‘మీ ఫోన్ నంబర్‌‌కు కోటి రూపాయల లాటరీ తగిలింది. ముందు మీరు ఓ పదివేలు మా అకౌంట్‌లో వేస్తే లాటరీ డబ్బు మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది..’ అంటుందొక ఈమెయిల్ .‘50 వేల సెల్‌ఫోన్ కేవలం ఐదు వేలకే మీ సొంతం. ఈ లింక్ క్లిక్ చేసి డబ్బులు పంపితే రెండు రోజుల్లో ఫోన్ మీ ఇంటికి..’ అంటుందొక వాట్సాప్ మెసేజ్ .‘నువ్వు స్నానం తీస్తుండగా నేను వీడియో తీశాను. నాకు 10వేలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా..’ అని సోషల్ మీడియా చాట్‌లో బెదిరిస్తాడో కీచకుడు.

మోసం, దగా, బెదిరింపు.. పేరు ఏదైనా నేరం ఒకటే. సైబర్ నేరం! సెల్ ఫోన్లు, బ్యాంకు కార్డులు, సోషల్ మీడియా, ఇతర టెక్నాలజీని నేరాలకు వాడుకుంటూ డబ్బులు దండుకుంటున్న ముఠాలు నిత్యం మన చుట్టూనే ఉంటాయి. దోషులు కొన్నిసార్లు మన దగ్గరి స్నేహితులు, బంధువులే అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

టెక్నాలజీతోపాటు విస్తరిస్తున్న సైబర్ నేర సామ్రాజ్యాన్ని నేలమట్టం చెయ్యడానికి పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి చిక్కకుండా నేరగాళ్లు కూడా ఎన్నో కొత్తదారులు వెతుక్కుంటున్నారు. సైబర్ నేరాల వల్ల దేశంలో ఏటా వేల కోట్ల మోసాలు జరుగుతున్నాయి. వ్యక్తులనే కాకుండా సంస్థలను కూడా నేరగాళ్లు దోచుకుంటున్నారు.
మరి, సైబర్ నేరగాళ్ల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా? అసలు సైబర్ నేరాలు ఎలా చేస్తారు? వాటిపై మనకు ఎంతవరకు అవగాహన ఉంది? మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఈ డిజిటల్ చెల్లింపుల యుగంలో భద్రంగా దాచుకోవడం ఎలా?
కార్డులు, డేటాతో..

సైబర్ నేరాల్లో ఆర్థిక నేరాలే ఎక్కువ. బ్యాంకు కార్డులు, ఆన్‌లైన్ వ్యాపారం, హ్యాకింగ్ వంటి మార్గాల్లో ఈ నేరాలకు పాల్పడతారు. మన ఫోన్ నంబర్లు, మనం వివిధ కంపెనీలకు అందించే సమాచారం, ఈమెయిల్స్, మొబైల్ అప్లికేషన్లు, సోషల్ మీడియా ఖాతాలు.. మరెన్నో మార్గాల ద్వారా నేరగాళ్లు మన ఫైనాన్షియల్ డేటాను సంపాదిస్తారు. ఈమెయిల్స్ హ్యాక్ చేయడం, కార్డుల క్లోనింగ్, మాల్ వైరస్ లింకులు.. కేవైసీ పేరుతో బ్యాంకు ఖాతాల నంబర్లు, ఓటీపీ, పాస్ వర్డ్, సీవీవీ నంబర్ వంటివి అడగడం.. తదితర మార్గాల్లో మన బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకుంటారు.
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

సాధ్యమైనంతవరకు మన లావాదేవీల వివరాలను ఎవరికీ ఇవ్వకపోవడమే మేలు. కేవైసీ అప్డేషన్ పేరుతో వచ్చే మెసేజీలను అసలు నమ్మకూడదు. షాపుల్లో, పెట్రోల్ బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లావాదేవీలు మన కళ్లముందే జరిగేలా చూడాలి. కొత్త వ్యక్తులకు చెల్లింపులు జరపాల్సి వస్తే వారి వివరాలను సేకరించాలి. ఒకటికి రెండుసార్లు మోసం లేదని తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, ఎగ్జిబిషన్ వంటి చోట్ల గిఫ్ట్‌లు, సర్వే అంటూ కొందరు డేటా సేకరిస్తుంటారు. వారికి దూరంగా ఉండాలి. మీ బ్యాంకు అకౌంట్లు, మొబలైల్ బ్యాంకు అప్లికేషన్ల పాస్‌వర్డ్‌లను కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు. వాటిని తరచూ మారుస్తుండాలి. మరిచిపోతే ఫర్గెట్ పాస్‌వర్డ్ ఆప్షన్ ఉంటుంది కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ల నుంచి డేటా లీక్ కాకుండా వాటిని లాక్ చేసుకోవాలి. ఈకామర్స్ వెబ్ సైట్లను వాడిన తర్వాత తప్పనిసరిగా లాగౌట్ చెయ్యాలి. ఇంటర్నెట్ కేఫ్‌లను, పబ్లిక్ వైఫైని అత్యవసరం అయితే తప్ప వాడుకోకూడదు.
ఫోటోలు, వీడియోలు, చాటింగ్‌లతో..

సైబర్ నేరాల్లో ఆర్థిక నేరాల తర్వాత లైంగిక నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. నేరస్తులు అమ్మాయిలనే కాకుండా, అబ్బాయిలను కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రొఫైల్స్‌తో అకౌంట్లు సృష్టించుకుని దందాకు దిగుతున్నారు. స్నేహం, ప్రేమ పేరుతో నెమ్మదిగా పరిచయాలు పెంచుకుని మన వివరాలు రాబడతారు. మెసేజీలు, చాటింగ్‌లతో ‘యూ ఆర్ బ్యూటిపుల్, ఐ లవ్యూ, యూ ఫన్నీ..’ అంటూ వల విసురుతారు. హోటళ్లలో, పార్కుల్లో, ఊరిబయట కలుసుకుందామంటారు. మోసాన్ని గుర్తించకుండా మనం తప్పటడుగులు వేస్తే క్యాష్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసే ఫోటోలతోపాటు, మనం వారితో దిగిన ఫోటోలను, తీయించుకున్న వీడియోలను అశ్లీలంగా మార్చి పోర్న్ వెబ్ సైట్లలో పెట్టి, మన ఫోన్ నంబర్లను జతచేస్తారు. తర్వాత ఆ సమాచారం మనకు చేరవేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇలాంటి బెదిరింపులతో ఎంతోమంది అమ్మాయిలపై అత్యాచారాలు జరిగాయి.
అనుమానమే పరిష్కారం..

ఇలాంటి నేరాలను అడ్డుకోవడానికి అనుమానమే పరిష్కారం. కొత్త వ్యక్తులతో పరిచయాల విషయం జాగ్రత్తగా ఉండాలి. మన వ్యక్తిగత వివరాలను అడిగే వారిని అనుమానించాలి. చాటింగ్, ఫోటోలు, వీడియోల షేరింగ్ విషయంలో ఆచితూచి స్పందించాలి. అమ్మాయిలు అబ్బాయిలతో సన్నిహితంగా ఫోటోలు, వీడియోలు తీయించుకోకపోవడమే మేలు. హోటళ్లు, హాస్టళ్లు, షాపింగ్ మాల్స్ తదితర చోట్ల బాత్రూంలకు వెళ్లేటప్పుడు కెమెరాలు వంటివేమైనా ఉన్నాయేమో గమనించాలి. అబ్బాయిలు కూడా ఆన్‌లైన్ పరిచయాల్లో ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. నేరగాళ్లు అందమైన అమ్మాయిల ఫోటోలను ప్రొఫైల్స్‌గా పెట్టుకుని లూటీ చేస్తుంటారు. మన స్నేహితుల పేర్లతో ఫేక్ అకౌంట్ల నుంచి మెసేజీలు వస్తుంటాయి. కష్టాల్లో ఉన్నామని, వెంటనే డబ్బు పంపాలని వచ్చే మెసేజీలు పంపుతుంటారు. వాటిని చూడగానే డబ్బు పంపకుండా, మీ స్నేహితులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలి.
మన దురాశతో మన కంట్లోనే..

డబ్బులు ఎవరికీ ఊరికేరావు, మోసం చేస్తే తప్ప. ఆన్‌లైన్లో తక్కువ ధరలకు వస్తువులు వస్తున్నాయంటే ఆశపడొద్దు. ఎందుకు తక్కువకు ఇస్తున్నారో అనుమానించాలి. ఆఫర్లు నిజమా, అబద్ధమా తెలుసుకోవాలి. కంపెనీల వస్తువులైతే వాటికి ఫోన్ చేసి కనుక్కోవాలి. భారీ డిస్కౌంట్లు, ఒకటి కొంటే రెండు ఉచితం వంటి ఆకర్షణీయ ఆఫర్లను క్షణ్నంగా పరిశీలించారు. ఆ వస్తువుల ధర మార్కెట్లో ఎంత ఉందో తెలుసుకోవాలి. ఈకామర్స్ వెబ్‌సైట్లు సెక్యూర్డా కాదా అని నిర్ధారించుకున్న తర్వాత లావాదేవీలు జరపాలి. మనం కొనే ఉత్పత్తులపై ఇతర కస్టమర్ల రివ్యూలు చదవాలి. రిటర్న్, రీపేమేంట్ ఆప్షన్ ఉన్న వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలి..

సైబర్ నేరస్తులు మనల్ని మోసం చేసినప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పరువు పోతుందని భయపడకుండా నేరగాళ్లతో జరిగిన సంభాషణలను, లావాదేవీలను పోలీసులకు వివరించాలి. హైదరాబాద్ పోలీస్ వెబ్‌సైట్లో సైబర్ నేరాలను విచారించే అధికారుల పేర్లు, వారి ఫోన్ నంబర్లు ఉన్నాయి. మోసపోయిన తర్వాతే కాకుండా మోసపోతున్నామని అనుమానం వచ్చినప్పుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మన ఫిర్యాదు మనకు న్యాయం చేయడమే కాకుండా మరో పదిమంది మోసపోకుండా కాపాడుతుంది.