Cyclone Asani: IMD issues red warning for Andhra coast as cyclone changes track
mictv telugu

ఉత్తరాంధ్రకు హెచ్చరిక.. దిశ మార్చిన అసని..

May 10, 2022

Cyclone Asani: IMD issues red warning for Andhra coast as cyclone changes track

బంగాళా ఖాతంలో ఏర్పడిన అసని తుపాను.. దిశను మార్చుకుంది. రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో.. ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. బుధవారం సాయంత్రానికి తుపాన్ మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోందని, ఆ తర్వాత విశాఖపట్నం వద్ద సముద్రంలోకి వెళ్ళవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అసని తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ తుపాను తూర్పు కోస్తాకు సమీపించినట్లు తెలిపింది. గంటకు 105 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో కార్యాకలాపాలను నిలిపివేశామని, 23 విమానాల రాకపోకలను రద్దు చేశామని విమానాశ్రయం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
అసని తుపాను కారణంగా తెలంగాణాలో కూడా రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో బుధవారం చెదురుమదురుగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.