నిసర్గ ధాటికి రన్‌వే నుంచి జారిపోయిన విమానం
నిసర్గ తుపాన్ ధాటికి విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం రన్‌వే నుంచి జారిపోయింది. నిసర్గ తుపాన్ నేపథ్యంలో పెనుగాలల కారణంగా బుధవారం మధ్యాహ్నాం 12:13 గంటల సమయంలో బెంగళూరు నుంచి ముంబై వచ్చిన ఫెడెక్స్ విమానం 5033 ల్యాండ్ అయ్యే సమయంలో రన్ వే 14పై నుంచి జారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నిసర్గ తుపాన్ కారణంగా ముంబై నగరంలో భారీ వర్షం కురుస్తోంది. భారీ ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఈ క్రమంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఫెడెక్స్ విమానం రన్ వే పై నుంచి జారి పక్కకు వెళ్లిపోయింది. అదుపు తప్పిన విమానం రన్ వే పై నిలిచిన వరద నీటిని తోసుకుంటూ రన్ వే దాటి వెళ్లింది. దీంతో పైలట్లు అప్రమత్తం అయి చాకచక్యంగా విమానాన్ని ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కాగా, తుపాన్ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నాం 2:30గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ముంబై ఎయిర్‌పోర్ట్‌లోకి విమానాల రాకపోకలను ఆపేశారు.