ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రతో పాటు తమిళనాడు రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి బలపడి సాయంత్రానికి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది.
వాయవ్య దిశగా కోస్తాంధ్ర – తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తూ 8వ తేదీ ఉదయానికి తుఫానుగా మారుతుందని వివరించింది. తుఫానుగా మారి తీరాన్ని దాటిన అనంతరం తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో 7వ తేదీ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడులో మోస్తరు నుంచి అతి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని, 8వ తేదీ ఉదయం తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రత్యేకించి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురంలలో భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని మత్స్యకారులు 7 నుంచి 10వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంతాల్లోని రెవెన్యూ యంత్రాంగాన్ని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది.