భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో భారీ పతనం నమోదయింది. అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి పెరగడం, చైనా కొవిడ్-19 హెచ్చరికల భయాలు వెరసీ దేశీయ స్టాక్ మార్కెట్లో మరో ‘బ్లాక్ మండే’ నమోదయింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 15,800 స్థాయిని కోల్పోయింది. మొత్తంగా మదుపరుల సంపద రూ.6 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ పెంపు నిర్ణయం తీసుకోనుందనే వార్తలు దేశీయ మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. మరోవైపు దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం సైతం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. మే నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు సోమవారం విడుదల కానున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించినట్లు తెలుస్తోంది. దేశీయంగా రూపాయి బలహీన పడడం దలాల్‌స్ట్రీట్‌లో అమ్మకాలకు మరో కారణం.వీటితో పాటు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గరిష్ఠ స్థాయికి చేరడం, చైనాలో కొవిడ్ కేసులు పెరుగుదల నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై అనుమానాలు రేకెత్తడం వంటి ఇతర కారణాలతో మన సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.