సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ ఆయన సోదరుడు వెంకటేష్‌లు తనను మోసం చేశారని సదరన్ స్పైసిస్ గ్రూపు చైర్మెన్ నందకుమార్ ఆరోపించారు. పురానా హవేలీలోని సిటీ సివిల్ కోర్టులో విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సురేష్ బాబు తనకు అమ్మిన భూమిని ఆయన కొడుకు రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని, తనకు అగ్రిమెంట్ చేసిన భూమినే మరొకరికి కూడా అగ్రిమెంట్ చేశాడని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కోర్టు ఆర్డర్ ఉన్నా రానా పేరున ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రశ్నించారు. సినీ హీరో వెంకటేస్ సైతం 1200 గజాల భూమిని లీజ్ అగ్రిమెంట్ చేసి తనకిచ్చారని గుర్తు చేశారు. అగ్రిమెంటు చేసిన తర్వాత తనను బలవంతంగా ఖాళీ చేయించడానికి దగ్గుబాటి కుటుంబం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాగా, ఈ కేసు విచారణకు సినీ హీరో రానా హాజరుకాకపోవడంతో కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది.