మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడిగానే కాకుండా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు స్వస్తి చెప్పారు. చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటున్న ఆయన.. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆయన భార్య పురందేశ్వరి బీజేపీలో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వెంకటేశ్వరావు సైలెంట్ అయిపోయారు. దీంతో రాజకీయాల్లో ఉంటారా? ఉండరా అన్న చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆయన తాజాగా సంచలనం నిర్ణయం ప్రకటించారు. తన కురుమాడు హితేష్, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఏపీ రాజకీయాల్లో దగ్గుబాటి నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
ఎందుకంటే.. సాధారణంగా వయసు పెరిగి.. రాజకీయాలకు స్వస్తి చెప్పే నేతలు.. తమ వారసుల్ని పరిచయం చేస్తారు. కానీ.. దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాత్రం తనతోపాటూ తన కొడుకు హితేష్ చెంచురామ్ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బాపట్ల జిల్లా.. ఇంకొల్లులో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడున్న రాజకీయాలకు విలువలు లేవని ఇలాంటి పాలిటిక్స్‌లో ఉండటం, సర్దుకుపోవడం తన వల్ల కావట్లేదని చెప్పారు దగ్గుబాటి. రాజకీయాలు పూర్తిగా డబ్బు చుట్టూ తిరుగుతున్నాయని, కక్ష సాధింపు రాజకీయాలు ఉన్నాయని అన్నారు. విలువలు లేని రాజకీయాల్లో ఉండటం కంటే.. పూర్తిగా వదిలేయడమే బెటర్ అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.