కుక్క మొరిగిందని పిచ్చకొట్టుడు కొట్టాడు.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

కుక్క మొరిగిందని పిచ్చకొట్టుడు కొట్టాడు.. వీడియో వైరల్

July 4, 2022

కుక్క తనని చూసి మొరిగిందని ఢిల్లీలో ఓ వ్యక్తి ఆ కుక్కను ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టాడు. అంతటితో ఆగక అడ్డుకోవడానికి ప్రయత్నించిన పొరుగింటి వ్యక్తిని, కాళ్లు పట్టుకొని ఇంట్లోకి వెళ్లడాన్ని అడ్డుకున్న మహిళను విచక్షణారహితంగా చితకబాదాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డవడంతో సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరమ్ వీర్ దహియా అనే వ్యక్తి పొరుగింటి రక్షిత్ అనే వ్యక్తికి చెందిన కుక్క మొరిగిందనే కోపంతో కుక్క తోక పట్టుకొని దూరంగా విసిరేశాడు. దాంతో కుక్క అటాక్ చేసి కరవడంతో చేతిలో ఉన్న ఇనుపరాడ్‌తో దాని తలపై బలంగా కొట్టాడు. ఫలితంగా కొట్టిన చోట రక్తం గడ్డకట్టుకుపోయింది. అంతలో ఆపడానికి వచ్చిన మరో పొరుగింటి వ్యక్తిని కూడా దహియా రాడ్డుతో వీపుపై కొట్టాడు. ఈ క్రమంలో తమ ఇంట్లోకి ప్రవేశించకుండా మహిళ కాళ్లు పట్టుకొని అడ్డుపడగా, సినిమాలో హీరో విలన్‌ని కొట్టినట్టు కొట్టాడు. దెబ్బలకు తాళలేక మహిళ దహియా కాళ్లు వదిలేసింది. ఇదంతా సీసీకెమెరాల్లో రికార్డవగా, సాక్ష్యంగా వీడియో ఫుటేజీ ఉండడంతో పోలీసులు దహియాపై కేసు నమోదు చేశారు. కాగా, ప్రస్తుతం ముగ్గురు బాధితులతో పాటు రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేసిన దహియా కూడా కుక్క కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.