చిటికేస్తే చాలు.. మూడో కన్ను తెరవమంటావా..మూడు కన్ను తెరిస్తే అంతే సంగతి..ఇవేవో సినిమాలో డైలాగ్స్ అనుకుంటే పొరపాటే. రియల్ గానే ఓ వైసీపీ ఎమ్మెల్యేకు నందమూరీ బాలకృష్ణ ఇచ్చిన వార్నింగ్ అది. తన సినిమా పాట వేశాడని ఓ వైసీపీ కార్యకర్తను తిట్టిన వైసీపీ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి బాలయ్య సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. అయితే బాలయ్య యాక్షన్‌కు ఎమ్మెల్యే గోపిరెడ్డి నుంచి రియాక్షన్ అంతే ఫాస్ట్‌గా రావడం ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
బాలయ్య మాస్ వార్నింగ్
గుంటూరు జిల్లా తెనాలిలోని ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర పురస్కార మహోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అథితిగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గోపిరెడ్డిపై ఫైరయ్యారు.
ఓ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్త బాలయ్య పాటను పెట్టడంపై గోపిరెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుసుకున్న బాలకృష్ణ తీవ్ర స్థాయిలో గోపిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరన్నారు. అన్ని పార్టీల వాళ్లు తన సినిమాలు చూస్తారని తెలిపారు. ఇలాంటి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలంటూ హెచ్చరించారు. తాను చిటికేస్తే చాలు అని.. మూడు కన్ను తెరిస్తే అంతే సంగతి అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్యే గోపిరెడ్డి కౌంటర్
బాలకృష్ణ వార్నింగ్ పై గోపిరెడ్డి రియాక్టయ్యారు. నా ఇలాకాలో నీ ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి..అంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు వార్నింగ్ ఇవ్వడానికి బాలకృష్ణ ఎవరని ప్రశ్నించారు. బాలయ్య పెద్ద హీరో అయితే ఎవరికి గొప్ప అన్నారు. అయినా ఒకే మనిషే అని గుర్తుంచుకోవాలన్నారు. అసలు విషయం తెలుసుకోకుండా బాలకృష్ణ మాట్లాడం కరెక్ట్ కాదని సూచించారు. తాగుబోతులకు వెనకేసుకొచ్చి బాలయ్య వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని హితవు పలికారు. సినిమాలు, నిజ జీవితం వేరని బాలయ్య తెలుసుకోవాలన్నారు గోపిరెడ్డి. రియల్ లైఫ్‌లో నటించడం కుదరదని కౌంటరించ్చారు.