దినసరి కూలీకి రూ.కోటి పన్ను కట్టాలని నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

దినసరి కూలీకి రూ.కోటి పన్ను కట్టాలని నోటీసులు

January 16, 2020

gvfv

రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న ఓ కూలీకి రూ.కోటి పన్ను కట్టాలని ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో ఆ కూలి కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్‌కు చెందిన బాబాసాహెబ్ అహీర్(35) ముంబయిలోని అమ్బివ్లీ మురికివాడలో ఉన్న బంధువు ఇంట్లో ఉంటూ కూలీగా పనిచేస్తున్నాడు. రోజుకు రూ.300 వరకు సంపాదిస్తున్నాడు. ఈ స్థితిలో ఉన్న అహీర్‌కు ఓ రోజు ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు వచ్చింది. 

ఆదాయపు పన్ను కింద రూ. 1.05 కోట్లు చెల్లించాలని అందులో ఉంది. గతేడాది సెప్టెంబర్ 5న మొదటిసారి అహీర్‌కు ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు వచ్చింది. ఈ విషయాన్ని అతడు మరచిపోయాడు. కొద్ది రోజులు గడిచాక, అదే నోటీసు మళ్లీ వచ్చింది. దీంతో బాబాసాహెబ్.. పోలీసులను ఆశ్రయించాడు. ఈ నోటీసులు ఎందుకు వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా కొన్ని షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు బాబాసాహెబ్ బ్యాంకు ఖాతాలో రూ.58 లక్షలు డిపాజిట్ చేశారని తెలిసింది. దానికి అహీర్ పాన్ నెంబరు జత చేయకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు పన్ను కట్టాలని నోటీసులు పంపినట్లు వెల్లడైంది. అహీర్ బ్యాంకు ఖాతాలో రూ.58 లక్షలు డిపాజిట్ చేసినట్టు ఐటీ అధికారుల వద్ద ఆధారాలున్నాయి. అయితే, అసలు తనకు బ్యాంకు ఖాతానే లేదని అహీర్ వాదిస్తున్నాడు. తప్పుడు పాత్రలతో ఎవరో తన పేరుతో బ్యాంకు ఖాతా తెరచిఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. తాను ఇంతవరకు రూ.లక్ష రూపాయలను ఒకేసారి చూడలేదని తెలిపాడు.