Daily Wager to India’s first Trans Postwoman life journey
mictv telugu

మొట్టమొదటి ట్రాన్స్ పోస్ట్ ఉమెన్!

December 21, 2022

 Daily Wager to India’s first Trans Postwoman life journey

పార్వతి టి ఎస్.. భారతదేశంలో మొదటి ట్రాన్స్ పోస్ట్ ఉమెన్. ఆమె తన స్వంత గుర్తింపును అంగీకరించే తన ప్రయాణం, వేధింపులు, తిరస్కరణలను అధిగమించిన తనకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకోవడం గురించి ఈ ప్రత్యేక కథనం..

కేరళలోని కొల్లాం జిల్లా రోజ్మాలా గ్రామం. అక్కడ 36యేండ్ల పార్వతి అక్కడ కుమరేశన్ టి ఎస్ గా జన్మించింది. ప్రస్తుతం అఫీషియల్ గా పార్వతి గా మారిపోయింది. ‘నేను చిన్నవయసులోనే నాలో ఉన్న ఆడ లక్షణాలను గుర్తించాను. ఎప్పుడూ ఆడవాళ్లలా డ్రెస్ వేసుకునే ఛాన్స్ వచ్చినా వదులుకోలేదు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటేషన్ వస్తే చాలు.. కచ్చితంగా అమ్మాయి డ్రెస్ వేసుకొని మురిసిపోయేదాన్ని’ అంటుంది పార్వతి. అమ్మాయిలా జుట్టు కట్టుకోవడం, కాటుక దిద్దుకోవడం చేసుకోవడంతో అందరూ ఎగతాళి చేయడం ప్రారంభించారు. కాలేజ్ కి వచ్చాక కూడా అవే మాటలు పడడం జరిగింది. దీంతో ఉన్న ఊరు వదిలి పారిపోయింది పార్వతి.

అమ్మాయిలా మారడానికి..
ఆడవాళ్లలా తన ఐడెంటిటీని మార్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడింది పార్వతి. ప్రపంచానికి తనని తాను కొత్తగా పరిచయం చేయడానికి చాలా మాటలు పడింది. చివరకు తమిళనాడులోని తెన్కాసికి చేరుకుంది. అక్కడ ట్రాన్స్ ఉమెన్ లను కలిశాక తనకు తన మీద ఆత్మవిశ్వాసం కలిగింది. అక్కడే చెవులు, ముక్కు కుట్టించుకుంది. అదే తను తీసుకున్న మొదటి, అతి పెద్ద స్టెప్. తర్వాత పూర్తిగా అమ్మాయిగా మారి ఇంటికి చేరుకుంది. అక్కడ తన కుటుంబం ఆమెను కుమరేశన్ గానే చూస్తామని చెప్పేశారు. ఎందుకంటే.. వారిది గిరజన తెగ. అప్పటికే వారి పట్ల వివక్ష ఎక్కువ. దీంతో పార్వతిని అక్కున చేర్చుకోలేకపోయారు.

కొత్త కొత్తగా..
పార్వతి ఇలాంటి వాటిని పట్టించుకోవాలని అనుకోలేదు. తను స్వంతగా తన కాళ్ల మీద తాను నిలబడేందుకు ఏం చేయాలో ప్రణాళికలు వేసుకుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసింది. ఉద్యోగం దొరికే వరకు పెట్రోల్ బంక్ లో పని చేసింది. అంతేకాదు అదే సమయంలో ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. తన గురించి తెలిసిన ఆ వ్యక్తి పార్వతిని భాగస్వామిగా చేసుకున్నాడు. అలా 2012లో పార్వతికి ఉద్యోగం వచ్చింది. కానీ అప్పటికి కుమరేశన్ గానే అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి. అయినా ఆమె ధైర్యం చెక్కు చెదరలేదు. కొత్త జీవితం కోసం అన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది.

వెక్కిరింపుల మధ్య..
పని చేసే చోట కూడా చాలా వేధింపులకు గురయింది పార్వతి. రోజు ఒక ఊరు నుంచి మరొక ఊరికి బైక్ మీద ప్రయాణం చేసి వచ్చేది. దారిలో ఎగతాళి చేసినా పట్టించుకోకుండా తన ఉద్యోగాన్ని చేసుకుంటూ పోయింది. 2018లో మొదటి సారి ట్రాన్స్ ఉమెన్గా మారి కొల్లాం జిల్లాలో పార్లమెంట్ ఎలక్షన్లో ఓటు వేసిన మొదటి మహిళగా పేరు తెచ్చుకుంది. 9 నవంబర్ 2022లో పార్వతి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ జెండర్ గా ఆర్డర్ తీసుకుంది. ఇప్పుడుయకుటుంబం, ఇతరులు కూడా పార్వతికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

ఆదర్శంగా ఉండాలని..
‘కేరళలో మొత్తం 400 ట్రాన్స్ పీపుల్ ఉన్నారు. వారందరూ వాళ్ల సొంత ఐడెంటిటీ కోసం చూస్తున్నారు. వారికి నేను ఆదర్శంగా నిలవాలి. అండగా నిలబడాలి. మరికొందరు నాలాగా ఉద్యోగాలు చేసి తమని తాము నిరూపించుకోవాలి’ అంటున్నది పార్వతి.