భయంతో ఎన్నాళ్లు ఉండగలం - MicTv.in - Telugu News
mictv telugu

భయంతో ఎన్నాళ్లు ఉండగలం

October 28, 2022

కశ్మీర్ పండిట్లు భయంతో లోయను వదిలిపెట్టి వెళ్తున్నారు. అక్కడ నివసిస్తున్న చివరి పండిట్ మహిళ డాలీ కుమారి జమ్మూకు వలస వెళ్లిపోయింది. దీంతో లోయలో పండిట్లు లేకుండా పోయారు. షోపియాన్ జిల్లా చౌదరి గుండ్ గ్రామంలో ఏడు కుటుంబాలు నివసిస్తుండగా, ప్రత్యేకంగా వారిని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చారు. దీంతో మిగిలిన వారు భయంతో వలసల బాట పట్టగా, డాలీ కుమారి మాత్రం ధైర్యంతో అక్కడే ఉంటూ వచ్చింది.

కానీ, ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని భావించి బరువెక్కిన కన్నీళ్లతో స్వగ్రామాన్ని విడిచి పెట్టింది. తిరిగి లోయలో ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే వస్తానని, స్వంత ఇల్లు, పొలాన్ని వదిలేసి వెళ్తున్నందుకు బాధగానే ఉందని వెల్లడించింది. ఇదిలా ఉంటే అటు అధికార యంత్రాంగం మాత్రం ఖండించింది. ఇవన్నీ తప్పుడు వార్తలని, పండిట్‌లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కాగా, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కశ్మీర్ ప్రశాంతంగా ఉంటుందని పండిట్లు భావించారు. కానీ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారడంతో జమ్మూకి వలస పోతున్నారు.