మనువు మరో సారి... - MicTv.in - Telugu News
mictv telugu

మనువు మరో సారి…

July 14, 2017

ఎన్ని ఊనాలు…. ఎన్ని యేడాదులు పూర్తి చేసుకున్నా…మనువు వాళ్లపై మరో సారి పూనాక ఏం జరుగుతుంది అన్యాయం తప్ప. మను ధర్మం గురించి ఎన్ని సార్లు చెప్పొద్దని అనుకున్నా… ఇండియా మారుతున్నదని మనస్సుకు కోటాను కోట్ల సార్లు సర్ది చెప్పుకున్నా… దళితులపై దాడులు, హత్యలు, మారణ కాండ జరుగుతున్న ప్రతీ సారి మనువు గుర్తుకు కొస్తూనే ఉన్నాడు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరికో మనువు పుట్టినట్లున్నాడు. దళితులు తమ వారే అని చెప్తారు. దాడులు చేస్తారు.

ఏదో సిన్మాల విలన్ అంటాడు…‘‘ గిల్లితే గిల్లిచ్చుకోవాలే… తంతే తన్నిచ్చుకోవాలి… ఏం మాట్లాడొద్దని.’’ అచ్చం ఈ గోరక్షకుల స్టోరీ కూడా అట్లనే ఉంది. దళితులు ఊర్ల నడిస్తే మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టాలని చెప్పాడు మనువు. ఇప్పుడు దేశంలో దళితులు మునుపటిలా కావాలని చూస్తున్నట్లుంది. లేక పోతే ఇన్నేండ్ల కాలంలో లక్షల  మంది దళితులు జంతర్ మంతర్ లో కదం తొక్కారా. 1985లో దళితులపై కారం చేడు ఊచకోత తర్వాత కనీసం కొంత విరామం ఇచ్చిన తర్వాత దక్షిణాది మనువులు దాడులు చేశారు. కానీ మోడీ  పవర్ లోకి వచ్చిన తర్వాత ఈ అపర మనువులు క్షణం క్షణం ఎప్పుడు ఎట్లా విరుచుకు పడ్తారో తెలియడం  లేదు.

గుజరాత్, రాజస్థాన్,  పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలోని అన్ని రాష్ట్రాలు పోటీలు పడి దళితులపై దాడులు చేస్తున్నట్లే లెక్క. వాళ్లుక ఇష్టం వచ్చినప్పుడు….. ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నారు. వాళ్లకు దళితులపై దాడులు చేయాలని కోరిక పుడితే చాలు… లేదంటే  దళితులు ధైర్యంగా తిరుగుతున్నారని వాళ్లకు అన్పిస్తే చాలు  దాడీ జరిగే  తీరుతుంది.

మధ్యప్రదేశ్ లో ఓ దళితుడు  ఘనంగా పెళ్లి చేసుకున్నాడని దాడులు చేశారు. మంచిగా బతుకుతున్నారని దాడులు చేస్తున్నారు. రిజర్వేషన్ల తీసేయాలని  ధర్నాలు చేస్తున్నారు. ఇట్లా ఎట్లా వీలైతే అట్లా  చేస్తూనే ఉన్నారు.  ఇంకో వైపు  అమిత్ షా లాంటి వారు తోటల్లో వండిన వంటలతో దళితుల ఇండ్లల్లో భోజనాలు చేస్తున్నారు. ఆ తర్వాత వారి శుభ్రతలు వారికుండనే ఉంటాయి.

నచ్చిన అమ్మాయిన ప్రేమిస్తే తప్పు… వారి ప్రాణానికే ముప్పు. కులాంతర వివాహాలంటే…ఏంటది ధర్మం పాడవుతుందని అంటారు. కులం చెక్కుచెదరకుండా ఉండాలనేది వారి వాదన సారాంశం. ఎన్ని పరువు హత్యలు. ఎంత అల్లకల్లోలం. అంతా మూడేళ్ల కాలంలోనే. ఇంతకు ముందూ జరిగింది. దీని సారంలోనే తేడా ఉంది. ఈ దాడులు చేసే వారికి ఏదో హిమ్మత్ దొర్కినట్లుంది. దళితులు మనుష్యులనే  ఆలోచన కూడా వీరికి లేనట్లుంది. నిజంగానే ఉంటే  దళితులపై ఇన్ని దాడులు జరిగాయి కదా. ఒక్క దాంట్ల కూడా విచారణ వేగవంతం చేసి… ఎందుకు శిక్షలు వేయలేదు. దీనికి సమాధానం మనువు దగ్గర మాత్రమే దొర్కేటట్లుంది.

అయినా తమపై దాడులు చేయోద్దని వేడుకుంటే మనువు మనస్సు కరుగుతుందా. దళతులు అంబేద్కర్ ను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని  ఆచరణ తీసుకోవడం తప్ప. అన్నట్లు…  వందల అడుగుల అంబేద్కర్ విగ్రహాలు పెడ్తామని చెప్తున్న నాయకులు… గరగపర్రు దిక్కు కన్నెత్తి కూడా చూడ లేదు  ఎందుకో. ఊరు వాడా అనే తేడా లేకుండా దళితులపై దాడులు జరుగుతున్నా… అమ్మ భారత మాత ఎందుకీ మౌనం.