దళితులపై 12 ఘోరాలు.. సుప్రీం తీర్పులో పస ఎంత? - MicTv.in - Telugu News
mictv telugu

దళితులపై 12 ఘోరాలు.. సుప్రీం తీర్పులో పస ఎంత?

April 4, 2018

ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం వల్ల అమాయకులకు ఇబ్బంది కలుగుతోందనే ధోరణిలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు, ఆ చట్టానికి చేసిన సవరణలపై దళిత సంఘాలు భగ్గుమంటుడడం తెలిసిందే. దేశంలో దళితులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయేగాని తగ్గడం లేదు. ఎవరు బాధితులన్నది స్పష్టంగా కనిపిస్తోంది. చట్టాల్లోని లొసుగులను అనువుగా మార్చుకుని దుండగులు బోరవిరుచుకుని తిరుగుతున్నారు.ప్రభుత్వం సేకరించే లెక్కలే.. దళితలపై నేరాలు పెరుగుతున్నట్లు తేల్చిచెబుతున్నాయి. జాతీయ నేర రికార్డుల సంస్థ లెక్కలు షాకింగ్ విషయాలను బయటపెడుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2012లో 33,655 కేసులు, 2013లో 39,408 కేసులు, 2014లో 47,064 కేసులు నమోదయ్యాయి. భిన్నత్వం ఏకత్వం అని గొప్పలు చెప్పుకునే ఆధునిక భారతంలో సాటి మనుషులపై సాగుతున్న ఘోరాలకు ఈ లెక్కలు నిదర్శనం.ఇక రికార్డులకు ఎక్కని ఘోరాల గురించి చెప్పుకోనక్కర్లేదు. వాస్తవం ఇలా ఉంటే, ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు, వాటిని సమర్థించేలా ఉన్న సుప్రీం కోర్టు మరో కోణాన్ని సూచిస్తున్నాయి. అసలు మన దేశంలో ఏ చట్టమూ సరిగ్గా అమలు కావడం లేదు. అధికార, ధనబలాలతో కేసులు మాఫీ అయిపోతుంటాయి. ఎస్సీ, ఎస్టీ చట్టం వల్ల ఎక్కడైనా కొందరు అమాయాకులు ఇబ్బంది పడుంటే ఉండొచ్చు కానీ దళితులపై సాగుతున్న నేరాలతో పోలిస్తే అవి లెక్కలోకి రావు. ఈ నేపథ్యంలో సహజంగానే సుప్రీం తీర్పుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పైగా కోర్టు ధర్మాసనంలో దళితులు లేకపోవడం గమనార్హం. సుప్రీం తీర్పు, దళితుల నిరసన నేపథ్యంలో ఇటీవలి చరిత్రలో దళితులపై సాగిన దాడులు, మారణకాండల చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం.. తరతరాలుగా సాగుతున్న అణచివేతతలో ఇవి సముద్రంలో నీటి చుక్కల్లాంటివి మాత్రమే. ఇందులో హత్యలు ఉన్నాయి, సామూహిక దహనాలు, కాల్చివేతలు ఉన్నాయి. చెప్పుకోడానికి కూడా భయం కలిగించే ఘోరాలూ ఉన్నాయి.

ఉనా (గుజరాత్)

చనిపోయిన ఆవు చర్మం వొలుస్తున్న నలుగురు దళితులపై దాడి చేశారు. గిర్ సోమనాథ్ జిల్లాలోని ఉనాలో 2016 జూలై 11న ఈ దారుణం జరిగింది. తాము ఆవును చంపలేదని, అప్పటికే చనిపోయిన ఆవు తోలు తీసుకుంటున్నామని బాధితులు చెప్పినా గోరక్షకులు వినకుకండా దాడి చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.

దేశ రాజధానికి కూతవేటు దూరంలో గ్రేటర్ నోయిడాలో 2015 అక్టోబర్ 9న జరిగింది. గౌతమ్ అతని సోదరులను కొందరు బెదిరించి మోటర్ బైకును, డబ్బును దోపిడీ చేశారు. గౌతమ్ కుటుంబ సభ్యులతో కలసి ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాడు. డంకర్ ఠాణా పోలీసులకు ఇది నచ్చలేదు. గౌతమ్ కుటుంబ సభ్యులపై దాడి చేసి, బట్టలు లాగిపడేసి రోడ్డుపైకి పంపారు.

డంకర్ (యూపీ)

దంగవాస్ (రాజస్తాన్)

భూవివాదం కేసులో ముగ్గురు దళితులను జాట్లు ట్రాక్టర్ ఎక్కించి బలితీసుకున్నారు. 2015 మే 16న ఈ ఘోరం జరిగింది.

సున్ పెడ్(హరియాణా)

2015 అక్టోబర్ 20న వైభవ్(మూడేళ్లు), దివ్య(9 నెలలు)లను రాజ్‌పుత్ మూకలు సజీవ దహనం చేశాయి. ఆ పిల్లల తండ్రి జితేందర్‌కు అంతకు ముందు రాజ్‌పుత్‌లతో గొడవ ఉండేది. ఈ గొడవ వల్ల ఒక రాజ్‌పుత్ యువకుడు 2014లో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగా పసికందులు ఇంట్లో పడుకుని ఉన్నప్పుడు రాత్రిపూట ఇంటికి నిప్పు పెట్టి చంపారు.

మిర్చిపూర్ (హరియాణా)2010 ఏప్రిల్ 21న 18 మంది దళితుల ఇళ్లను అగ్రవర్ణాలు బూడిద చేశాయి. 17ఏళ్ల సుమన్ అనే యువతిని, ఆమె తండ్రిని సజీవ దహనం చేశారు. వీధికుక్క తనను చూపి మొరిగిందని రాజీందర్ పాలి అనే జాట్ చేసిన గొడవ ఈ దారుణానికి దారి తీసింది.

బంత్ సింగ్ (పంజాబ్)2006 జనవరి 5న బంత్‌సింగ్ అనే దళిత సిక్కును గుర్తుతెలియని దుండగులు హత్య చేసి కాళ్లు చేతులు విరిచేశారు. బంత్ సింగ్ కూతురిపై అంతకు ఐదేళ్లకు ముందు అగ్రవర్ణాల వారు అత్యాచారం చేశారు. న్యాయం కోసం బంత్ పోరాడాడు. దీన్నిసహించలేక అతనిపై దాడి చేశారు.

ఖైర్లాంజీ(మహారాష్ట్ర)

2006 సెప్టెంబర్ 29న భండారా జిల్లాలోని ఖైర్లాంజీ గ్రామంలో దారుణం జరిగింది. మహర్ దళిత వర్గానికి చెందిన నలుగురిని మరాఠా కుంబీ అగ్రకులస్తులు 40 మంది మూకుమ్మడి దాడి చేసి చంపేశారు.

గొహానా (హరియాణా)

2005 ఆగస్టు 27న వాల్మీకి బస్తీకి చెందిన శివపాల్ అనే దళితుడికి, బల్జీత్ అనే జాట్‌కు గొడవ జరిగింది. శివపాల్‌కు అతని మిత్రులు అండగా నిలిచారు. బల్జీత్ చనిపోయాడు. ఉద్రిక్తత రేగింది. జాట్లు దాడులకు దిగడంతో దళితులు ఊర్ల నుంచి పారిపోయారు. బల్జిత్ హత్యకు కారకులైనవారిని అరెస్ట్ చేశారు. అయితే అగ్రవర్ణాలు అంతటితో ఆగలేదు. వెయ్యిమంది గొడ్డళ్లు, లాఠీలు, కిరోసిన్ తీసుకొచ్చిన వాల్మీకీ కాలనీపై దాడి చేశారు. 60 ఇళ్లను కాల్చేశారు.

లక్ష్మాపూర్ బాతే (బిహార్)1997 డిసెంబర్ 1న రణవీర్ సేన లక్ష్మణ్‌పూర్ బాతేలో 58 మంది దళితులను కాల్చిచంపింది. అంతకు ముందు గయలోని బారాలో జరిగిన 37 మంది భూస్వాముల హత్యలకు ప్రతీకారంగా ఈ ఘోరం చేశారు.

బథానీ తోలా(బిహార్)

1996 జూలై 11న భోజ్‌పూర్ లోని బథఆనీ తోలాలో రణవీర్ సేన సాయుధులు 21 మంది దళితులను ఊచకోత కోశారు. వీరిలో 11 మంది మహిళలు, ఆరుగు చిన్నారులు, ముగ్గురు నవజాత శిశువులు ఉన్నారు. 12 ఇళ్లను కూడా తగలబెట్టారు. నంది గ్రామంలో సీపీఐ ఎంఎల్ పార్టీ తొమ్మిది మంది భూస్వాములను హత్య చేసినందుకు ప్రతీకారంగా ఈ దారుణానికి తెగబడ్డారు. భూస్వాముల హత్యలతో దళితులకు సంబంధం లేదని సామాజికవేత్తలు చెబుతున్నారు. కూలి పెంచాలన్న డిమాండ్లను అగ్రవర్ణాలు సహించలేదు.

చుండూరు (ఆంధ్రప్రదేశ్)గుంటూరు జిల్లా చుండూరులో 1991లో ఘాతుకం జరిగింది. సినిమా హాల్లో ఒక రెడ్డి కులస్తుడికి అనుకోకుండా దళిత గ్రాడ్యుయేట్ కాలు తగిలింది. వివాదంలో దళిత యువకుడికి గ్రామస్తులు అండగా నిలిచారు. రెడ్డి కులస్తులు 13 మంది దళితులను చంపేశారు.

1968 డిసెంబర్ 25న భూస్వాములు.. 44 మంది దళితులను ఉసురు తీశారు. మృతుల్లో 16 మంది మహిళలు, 23 మంది చిన్నారులు ఉన్నారు. దళితులు సీపీఎం అండతో కూలి పెంచాలని ఉద్యమించడాన్ని భూస్వాములు జీర్ణించుకోలేకపోయారు. దళితులు ఎర్రజెండాలు పాతారు. భూస్వాములు, వారి అనుచరులు గ్రామాన్ని చుట్టుముట్టి మారణకాండకు తెగబడ్డారు. కొందరిని కాల్చిచంపారు, కొందరిని సజీవ దహనం చేశారు.

కీలవేన్మణి (తమిళనాడు)

ఇవేకాక వేంపెంట, కారంచేడు, పదిరికుప్పం, లక్ష్మింపేట, వాకపల్లి మరెన్నో ప్రాంతాల్లో దళితులపై, గిరిజనులపై దాడులు జరిగాయి. కొన్ని జాతీయస్థాయిలో వెలుగులోకి రాగా, కొన్ని వెలుగు చూడడం లేదు.