మురికివాడ నుంచి మిలినియర్‌.. దళిత మహిళ సక్సెస్ స్టోరీ - MicTv.in - Telugu News
mictv telugu

మురికివాడ నుంచి మిలినియర్‌.. దళిత మహిళ సక్సెస్ స్టోరీ

October 24, 2020

ledy01

వెనుకబడిన దళిత కుటుంబం నుంచి మిలీనియర్‌గా ఎదగడం అంటే అదో పెద్ద సాహసమే. మరీ ముఖ్యంగా మహిళలు పెట్టుబడి దారులుగా ఉన్నది చాలా తక్కువ సందర్భాలు. పేదరికాన్ని తట్టుకొని జీవితంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని దృఢ సంకల్పంతో నిలిచింది ఓ దళిత మహిళ. తాను ప్రతిభలో ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించింది. 12 ఏళ్ల వయసులోనే పెళ్లై ఆ తర్వాత వైవాహిక బంధం దెబ్బ తిన్నా కూడా ఎన్నో కష్ట నష్టాలను తట్టుకొని యావత్ దేశం ఆమెను చూసి గర్వపడే స్థాయికి చేరింది. ఆమె ఎవరో కాదు.. పద్మశ్రీ అవార్డు గ్రహిత కల్పనా సరోజ్‌. ప్రస్తుత యువతకు ఆమె గురించి తెలుసుకోవడం స్ఫూర్తి కలిగించే విషయం.

అప్పటి వరకు తాను జీరో ఆ వెంటనే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన ఘటనలను మనం సినిమాలోనే చూసి ఉంటాం. కానీ కల్పనా సరోజ్ విషయంలో మాత్రం అది నిజమైంది. 1961లో మహారాష్ట్రలోని విదర్భలో పేద దళిత కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి పోలీసు కానిస్టేబుల్. ఆరుగురు సంతానం కావడంతో ఏడో తరగతిలోనే  కల్పనకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఇది ఆమె జీవితాన్ని తీరని కష్టాల్లోకి నెట్టింది. 

ముంబై మురికి వాడలో ఉండే  సమీర్‌ సరోజ్‌ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కొన్ని రోజులకే వేధింపులు మొదలు అయ్యాయి. 12 మంది ఉండే ఇంటిలో వారందరికి వంట చేయడం, పనులు చేసి పెట్టడంతోనే రోజు గడిచిపోయేది. ఇంటి భారం అంతా ఆమె మోయాల్సి వచ్చేది. అన్ని చేసినా వేధింపులు తప్పకపోవడంతో పాటు తిండి కూడా సరిగా ఉండేది కాదు.ఆరు నెలల తర్వాత కూతురు వద్దకు వెళ్లిన తండ్రికి కల్పన బక్కచిక్కి కనిపించడంతో విషయం తెలిసి అతడు బాధపడ్డాడు. వెంటనే తన ఇంటికి తీసుకువచ్చాడు. 

కొంత కాలానికి తండ్రి ఉద్యోగం కూడా పోయింది. దాంతో కుటుంబ భారం మొత్తం కల్పన మీదే పడింది. కుట్టు మిషన్ ద్వారా పని చేసి డబ్బు సంపాధించేది. ఏదైనా వ్యాపారం కోసం రుణం కావాలని కోరినా ఎవరూ సాయం చేయలేదు. పెళ్లైన తర్వాత పుట్టింట్లోనే ఉండటం పొరుగు వారి సూటిపోటి మాటలు కూడా పెరిగిపోయాయి. ఏ ఉద్యోగం రాకపోవడంతో  ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది. అప్పుడే బాబాయ్ సాయంతో ఓ టైలర్ షాపులో హెల్పర్‌గా పనికి చేరింది. రెండు రూపాయల జీతమే అయినా కష్టపడి పని చేసేది. ఆమె బట్టలు వేగంగా కుట్టడం చూసి షాపు యజమాని ఆమెకు పని అప్పగించి నెలకు రూ. 102 జీతం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. 

ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా లోన్ పొంది తనలాంటి మహిళలెందరికో ఉపాధి చూపించింది. ఫర్నిచర్‌ వ్యాపారం మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అదే సమయంలో కమని ట్యూబ్స్‌ అనే సంస్థ దివాళా తీయడంతో యాజమాన్య హక్కులను కోర్టు కార్మికులకు అప్పచెప్పింది. తానే బకాయిలు, జీతాలు చెల్లిస్తానని చెప్పి 2000 సంవత్సరంలో కమనిట్యూబ్స్‌ ఇండస్ట్రీకి బోర్డు ప్రెసిడెంట్‌‌గా బాధ్యత తీసుకుంది. రూ.168 కోట్ల నష్టాల్లో ఉన్న కంపెనీనీ రూ.700 కోట్ల లాభాల్లోకి వచ్చింది. ఆమె చేసిన కృషికి 2013లో పద్మశ్రీ అవార్డుతో సత్కారం లభించింది.  ఇప్పుడు ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. పేదరికాన్ని, కష్టాలను అనుభవించిన ఆమె మురికి వాడ నుంచి మిలినియర్ స్థాయికి చేరుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.