దళితుల గ్రామ బహిష్కరణ.. వరుడు గుర్రంపై ఊరేగాడని.. - MicTv.in - Telugu News
mictv telugu

దళితుల గ్రామ బహిష్కరణ.. వరుడు గుర్రంపై ఊరేగాడని..

May 10, 2019

దేశ వ్యాప్తంగా దళితులపై దాడులకు అంతం వుండటం లేదు. కొందరు అగ్రవర్ణాలవారు కుల దురహంకారంతో దళితులపై దాడులకు పాల్పడుతున్నారు. దళితులకు గుర్రంపై ఊరేగే హక్కులేదని, గ్రామ సంప్రదాయాన్ని మంట కలిపాడని అతని సామాజిక వర్గాన్ని ఊరినుంచి వెలేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని మహేసాణా జిల్లాలో చోటు చేసుకుంది. అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే మెహుల్‌ పరం (24) మే 7న పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లిని కాస్త ఆడంబరంగా చేసుకోవాలనుకున్నాడు. గుర్రపు స్వారీ చేస్తూ తన బంధువులతో సంబరాలు చేసుకున్నాడు. ఇది సహించని అగ్రవర్ణాలకు చెందిన కొందరు మెహుల్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dalit groom rides horse, community faces village boycott.

మర్నాడు గ్రామంలో అత్యవసర మీటింగ్ పెట్టారు. అతను చేసింది చాలా పెద్ద తప్పు అని అన్నారు. దళితులకు గుర్రంపై ఊరేగే హక్కులేదని, గ్రామ సంప్రదాయాన్ని మెహుల్‌ మంట కలిపాడని మండిపడ్డారు. చేసిన తప్పుకు శిక్షగా దళిత సామాజిక వర్గానికి చెందిన వారిని ఊరినుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ సామాజిక వర్గం వారితో మాట్లాడినవారికి, సాయం చేసినవారికి రూ.5,000 జరిమానా విధించాలని తీర్పు ఇచ్చారు.

దీంతో ఆ గ్రామంలో వారి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. దుకాణదారులు ఎవరూ వారికి సరుకులు అమ్మేందుకు నిరాకరిస్తున్నారు. చివరికి గ్రామంలోని బావి నుంచి కూడా నీళ్లు తీసుకోవడానికి గ్రామస్థులు అడ్డుచెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. గ్రామ సర్పంచి వినూజీ ఠాకూర్‌, ఉప సర్పంచి బల్దియో ఠాకూర్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. వారిపై ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.  

గతేడాది రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలోని గోర్ధన్ పురా గ్రామంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక దళితుడు తన పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కడాన్ని సహించలేక అగ్రవర్ణాలవారు దాడి చేశారు. ఊరేగింపును అడ్డుకుని రాళ్లు రువ్వి, దళిత స్త్రీల బట్టలు చించేశారు.