అవినీతిని బయటపెట్టాడని దళితుడి హత్య
తనకు జరిగిన, జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తిన దళిత వ్యక్తిని దుండగులు దారుణంగా చంపేశారు. బండరాయితో తలపై మోది చంపేసి, తోటలో పడేసి వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం ఏకునాంపురంలో సోమవారం ఈ ఘటన జరిగింది.కుటుంబ సభ్యల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దళిత వ్యక్తి దాసరి వెంకట రమణయ్య (55)కు గ్రామంలోని అధికార పార్టీ నేతలతో భూ వివాదం ఉంది. గతంలో వారు రమణయ్య భూమిని అక్రమంగా తమ పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోగా, రమణయ్య కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసి తిరిగి తన భూమిని దక్కించుకున్నాడు.
అయితే పొలంలో మాత్రం రమణయ్యను అడుగుపెట్టనీయలేదు. అలాగే ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేశాడు. దీంతో కోపగించిన ఫీల్డ్ అసిస్టెంట్, అతని తండ్రి రమణయ్యపై దాడి చేసి గాయపరిచారు. ఈ కేసు ప్రస్తుతం నడుస్తోంది. ఇదికాక, గ్రామంలోని పాఠశాలు కావాలనే ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, దానివల్ల ఎస్సీకాలనీకి వెళ్లడానికి దారి లేకుండా పోతోందని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో రమణయ్య రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి పొరుగూరుకు వెళ్లగా, దారి మధ్యలో కాపు కాసి చంపేసి జామాయిల్ తోటలో శవాన్ని పడేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్శి డీఎస్పీ ఆధ్వర్యంలోని టీమ్ రంగంలోకి దిగింది. ఈ పైపరిణామాల్లో ఉన్న కక్షిదారులు అంతా కలిసి రమణయ్యపై కుట్ర చేసి చంపేశారని మృతుని భార్య ఆరోపణ. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.