Dalit man thrashed, head shaved, face blackened on allegations of theft in UP's Bahraich
mictv telugu

దారుణం.. దళిత యువకుడికి గుండు కొట్టించి, మసి పూసి

October 23, 2022

దళితులపై అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ బహ్రైచ్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టాయిలెట్ సీటు దొంగిలించాడనే ఆరోపణలతో దళిత యువకుడిపై దాడి జరిగింది. అంతే కాదు ఆ యువకుడి ముఖానికి మసిపూసి, గుండు గీయించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. బహ్రైచ్ జిల్లాలోని హార్దియా ప్రాంతంలోని ఓ ఇంట్లో టాయిలెట్ సీటును దొంగిలించాడనే ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులు రాజేశ్ కుమార్(30) అనే యువకుడిని స్తంభానికి కట్టివేశారు. దినసరి కూలీ అతడిపై కొందరు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్‌ కుమార్‌ను పోలీసులకు అప్పగించడానికి బదులు అతడిని కట్టేసి తీవ్రంగా దాడి చేశారు. యువకుడి కనుబొమ్మలు బ్లేడ్‌తో గీకేశారు. సగం మీసాన్ని తీసేయడంతో పాటు గుండు కొట్టించారు. కోటియా గ్రామానికి చెందిన ముగ్గురిపై దాడి, నేరపూరిత బెదిరింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అట్రాసిటీ చట్టం నిబంధనల ప్రకారం వారిపై కేసు నమోదైంది. స్థానిక బీజేపీ నేత రాధేశ్యామ్ మిశ్రా, అతని సహాయకులు రేణు వాజ్‌పేయ్, రాకేష్ తివారీలను ఈ దాడికి పాల్పడిన నిందితులుగా గుర్తించారు. పోలీసులు ఇద్దరు సహాయకులను అదుపులోకి తీసుకున్నారు. మిశ్రా పరారీలో ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని, ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. రాజేష్ దొంగతనానికి వచ్చాడని నిందితులు పోలీసులకు తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది.