భరత్ రెడ్డి చంపుతానన్నాడు.. అందుకే అలా చెప్పాం - MicTv.in - Telugu News
mictv telugu

భరత్ రెడ్డి చంపుతానన్నాడు.. అందుకే అలా చెప్పాం

December 2, 2017

నిన్న ‘షూటింగ్’ మలుపు తిరిగిన బీజేపీ నేత భరత్ రెడ్డి దాడి కథ తాజాగా అసలైన మలుపు తిరిగింది. భరత్ రెడ్డి ‘సమర్పించు దొరల రాజ్యం’ షార్ట్ ఫిలిం గుట్టు రట్టయింది. దళితులపై జరిగిన ఈ అమానుష, అనాగరిక దాడి కేవలం ‘షూటింగ్’ అన్న కథ.. పకడ్బందీగా అల్లిన కట్టుకథ అని తేలిపోయింది. భరత్ రెడ్డి తమపై దాడి చేసింది నిజమేనని, ప్రాణభయంతో ఆ దాడిని ‘షూటింగ్’లో భాగం అని చెప్పామని బాధితులు లక్ష్మణ్, రాజ్వేశర్‌లు పోలీసులకు చెప్పారు.

 రెడ్డి మొరం అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు తమపై దాడి చేసి, బూతులు తిట్టి, సెల్ ఫోన్‌లో చిత్రీకరిచినదంతా పచ్చి నిజమని, షార్ట్ ఫిలిం షూటింగ్ కాదని వీరు స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి నిజామాబాద్ చేరుకున్న వీరిని ఏసీపీ కార్యాయంలో శుక్రవారం మూడుగంటల పాటు విచారించడంతో అసలు సంగతి తెలిసింది.భరత్ రెడ్డి తమను, తమ కుటుంబాలను చంపేస్తానని బెదిరించడం వల్లే తాము ‘షూటింగ్ ’ స్క్రిప్టును వినిపించామని లక్ష్మణ్, రాజేశ్వర్ చెప్పారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. ‘భరత్ రెడ్డి ఆ దాడి తర్వాత మమ్మల్ని ఓ పది నిమిషాలు మాట్లాడతామని చెప్పి.. ఏకంగా 18 రోజులు పాటు హైదరాబాద్‌లో నిర్బంధించాడు. మమ్మల్ని చంపుతామని, మా కుటుంబాలను నాశనం చేస్తానని బెదిరించాడు. కత్తులతో బెదిరించాడు.. సమస్య పరిష్కారం కోసం రెడ్డి తరఫు లాయర్లు వచ్చారు. గొడవ కోర్టుకు వెళ్లకుండా ఏం చేయాలో వారే చెప్పారు. దాడి నిజంగా జరగలేదని, ఇదంతా ‘దొరల రాజ్యం’ షూటింగ్‌లో భాగమని, దాడికి గురి అవుతున్నట్లు నటిస్తే 20 వేలు ఇస్తామని చెప్పినట్లు చెప్పమన్నారు. అందుకే.. ప్రాణభయంతో వాళ్లు చెప్పమన్నట్లే చెప్పాం. ప్రాణభయంతో.. మాకేం చేయాలో తోచక.. వారి చెర నుంచి బయటపడ్డానికి మాత్రమే అలా చెప్పాం..  అది షూటింగ్ కాదు.. మాపై జరిగిన దాడే.. యాక్టింగ్ చేయ్యాలి, హీరోలం కావాలి అన్న కోరికలేం మాకు లేవు’ అని వివరించారు.  కేవలం ప్రాణాలు కాపాడుకోవడానికి షూటింగ్ అని చెప్పామని, గత్యంతరం లేకనే అలా చెప్పాల్సి వచ్చిందని వాపోయారు.

నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో భరత్‌ రెడ్డి ఈ దాడికి పాల్పడ్డం తెలిసిందే. తర్వాత బాధితులు కనిపించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. మొరం అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు నిలదీయడంతో లక్ష్మణ్‌, రాజేశ్వర్‌లపై భరత్ రెడ్డి దాడి చేశాడు. చేత కర్రతో బాదాడు. రెండు చేతులు కట్టుకోవాలని, తప్పుచేశామని ఒప్పుకోవాలని బండబూతులు తిట్టాడు. నీటిగుంటలో మునకలు వేయించి, ముక్కు నేలకు రాయించాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.