దళితులు గుడిలోకి రాకుండా నిషేధం... - MicTv.in - Telugu News
mictv telugu

దళితులు గుడిలోకి రాకుండా నిషేధం…

August 24, 2017

ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని సంస్కరణలు ప్రవేశపెడుతున్న దేశంలో దళితులపై వివక్ష తొలగిపోవడం లేదు. దళితులు, మైనారిటీలపై దాడులకు కేంద్రంగా మారుతున్న ఉత్తరప్రదేశ్లో తాజాగా దళితులపై వివక్ష రక్కసి కోరలు చాచింది.

హమీర్ పూర్ జిల్లాలోని గదాహా గ్రామంలో ఉన్న రాంజానకి ఆలయంలోకి దళితులు రాకూడదని ఊర్లోని అగ్రకులాల పెత్తందార్లు నిషేధం విధించారు. గుడిలో తాము ‘రామాయణ్ పాఠ్..’ వేడుక నిర్వహిస్తున్నాం కనుక 10 రోజుల పాటు దిళతులు ఆ ఛాయలకు రావొద్దని హెచ్చరించారు. దళితులు అపరిశుభ్రంగా ఉంటారు కనుక రావొద్దని చెప్పుకొచ్చారు. అంతటితో ఊరుకోకుండా.. అసలు దళితులు తమ ఇళ్ల నుంచ బయటికే రావొద్దని హెచ్చరించారు.

ఈ నిషేధాన్ని ధిక్కరించి కొందరు దళితులు ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అగ్రవర్ణాలు వారిని బలవంతంగా బయటకి తోసేశారు. తర్వాత నిషేధాన్ని మరింత బహిరంగంగా ప్రకటిస్తూ ఓ నోటీసును గుడి గోడకు అతికించాడు పూజారి. దళితులు ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ నోటీసును తొలగించారు కాని, దళితులపై నిషేధాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. పైగా కర్రలు పట్టుకుని గుడిలోకి దళితులు రాకుండా కాపలా కాస్తున్నారు.

దీంతో గ్రామంలో ఉద్రికత్త నెలకొంది. ఇంత జరుగుతున్నా సీఎం యోగి ఆదిత్యనాథ్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రామాయణ్ పాఠ్ సందర్భంలోనే కాకుండా మిగతా రోజుల్లోనూ తమను గుడిలో రానివ్వడం లేదని దళితులు ఆవేదనతో చెబుతున్నారు.