మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం వెనుక చాలా కథ నడిచినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి టికెట్ దీని వెనుక కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. సంగారెడ్డి సీటును హస్తం పార్టీ జగ్గారెడ్డికి కేటాయించడంతో విధిలేని పరిస్థితిలో పద్మినీ కాషాయ కండువా కప్పుకున్నారు. జగ్గారెడ్డిపై కమలదళం తరఫున సమరభేరి మోగించనున్నారు.
నిజానికి పద్మిని రాజకీయాల్లోకి రావాలని చాలాసార్లు యత్నించారు. అయితే ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు కష్టమంటూ పార్టీ పెద్దలు నీళ్లు చల్లుతూ వస్తున్నారు. రాజనర్సింహకు అనుకున్నట్టుగానే ఆందోళ్ టికెట్ కేటాయించారు. జగ్గారెడ్డి అరెస్ట్ తదితర పరిణామాలతో ఈసారి అతడే తప్పక గెలుస్తాడనే గట్టి నమ్మకంతో సంగారెడ్డి నుంచి ఆయనను బరిలోకి దింపారు. కానీ, తనకే సంగారెడ్డి టికెట్ ఇవ్వాలని పద్మిని కోరినట్లు సమాచారం. దీనికి హైకమాండ్ ససేమిరా అనడంతో ఆమె బీజేపీవైపు చూపుసారించారు. సరిగ్గా శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద కూడా కలసి రావడంతో ఆమెకు సంగారెడ్డి నుంచి బీజేపీ టికెట్ ఖాయమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి, అమిత్ షాను కలసిన పరిపూర్ణానంద.. తన శిష్యురాలికి సంగారెడ్డి టికెట్ తీసుకొచ్చారని చెబుతున్నారు. విషయమంతా రాజనర్సింహకు తెలియకుండా జరగదని, కాంగ్రెస్లో అన్ని ప్రయత్నాలూ విఫలయ్యాకే ఆయన తన భార్యకు బీజేపీలో చేరడానికి అనుమతిచ్చారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నారు.