ఆ రికార్డు జగన్‌ది కాదు, 38 ఏళ్ల సంజీవయ్యది! - MicTv.in - Telugu News
mictv telugu

ఆ రికార్డు జగన్‌ది కాదు, 38 ఏళ్ల సంజీవయ్యది!

May 24, 2019

మన దేశ రాజకీయ నాయకుల సగటు వయసు ఎంత? ఇదివరకు యాభయ్యేళ్లో, అరవయ్యేళ్లో ఉండొచ్చని అనుకుంటాం. కానీ కాలం మారుతోంది కనక కొత్త తరం వస్తోంది. పరిటాల సునీత తన కొడుక్కి దారి చూపడానికి పోటీ నుంచి తప్పుకున్నారు. కానీ జనం అతణ్ని ఓడగొట్టారు. కొత్త రక్తానికి చోటిచ్చే ముసలి రక్తం చాలా తక్కువ. మన రాజకీయాల్లో వృద్ధులు ఇంకా పట్టుసాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 46 ఏళ్లకు సీఎం కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. కొందరైతే ఉమ్మడి ఏపీ, కొత్త ఏపీలో అతి చిన్నవయసులో సీఎం అయిన వ్యక్తి ఆయనే అని అంటున్నారు. అయితే చంద్రబాబు 1995లో 45 ఏళ్లకే సీఎం అయ్యారు. మరో ఇద్దరిని కూడా లెక్కలోకి తీసుకుంటే ఉమ్మడి ఏపీకి, ఇప్పటి ఏపీకి సంబంధించి చిన్నవయసులో సీఎం అయిన వారిలో జగన్ నాలుగో వ్యక్తి.

Damodaram sajeevayya Youngest chief minister in undivided Andhra Pradesh jagan mohan reddy fourth youngest cm

వీళ్లిద్దరే కాకుండా మరికొందరు తెలుగు నేతలు కూడా అతని చిన్నవయసులో ముఖ్యమంత్రి గద్దెను అధిరోహించారు. ఉమ్మడి ఏపీకి దామోదరం సంజీవయ్య 1962లో కేవలం 38 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఏపీ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 43 ఏళ్లకే సీఎం అయ్యారు. ఇక దేశంలో అత్యంత పిన్నవయసులో సీఎం అయిన రికార్డు ఎంవో హసన్‌ ఫరూఖ్‌ మారికర్‌ పేరుతో ఉంది. ఆయన 1967లో కేవలం 30 ఏళ్లకే పుదుచ్చేరి పగ్గాలు అందుకున్నారు. మూడుసార్లు ఆ పదవిలో కొనసాగారు. 2016లో పెమా ఖండూ 36 ఏళ్ల వయసులో అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం అయ్యారు. కాన్రాడ్ సంగ్మా(మేఘాలయ) 40 ఏళ్లకు, దేవేంద్ర ఫడ్నవీస్(మహారాష్ట్ర) 43 ఏళ్లకు, యోగి ఆదిత్యనాథ్(యూపీ) 44 ఏళ్లకు ముఖ్యపీఠాలను ఎక్కారు. ప్రఫుల్ల కుమార్ మహంత(అస్సాం) 33 ఏళ్లకు, అఖిలేశ్ కుమార్ యాదవ్(యూపీ) 39 ఏళ్లకు ముఖ్యమంత్రులయ్యారు.