Danam Nagender Sensational Comments On Bjp Leaders
mictv telugu

నిమజ్జనం రోజున కాషాయ బట్టలు తొడుక్కుని అల్లర్లకు కుట్ర

September 11, 2022

గణేష్ నిమజ్జనం రోజున హైదరాబాద్‌కు వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా స్పందించారు. వారు మాత్రమే హిందువులకు పుట్టారు.. మిగతావాళ్లు ఇంకెవరికో పుట్టారన్నట్లుగా బీజేపీ నేతల తీరు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇంకో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అస్సాం సంప్రదాయమా? అని నిలదీశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చెడగొట్టేందుకే అస్సాం సీఎం హైదరాబాద్‌కు వచ్చారా? అంటూ మండిపడ్డారు.

గణేష్ ఉత్సవ సమితి నేతలు కాషాయ బట్టలు వేసుకొని ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు దానం నాగేందర్. గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి గొడవలు సృష్టించే కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హైదరాబాద్‌‌కు వచ్చి విద్వేష వ్యాఖ్యలు చేశారని, కాషాయ బట్టలు తొడుక్కుని, టోపీలు పెట్టుకొని అల్లర్లకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.