కరోనానా దాని బొందనా.. క్వారంటైన్ సెంటర్లో డీజే డాన్సులు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనానా దాని బొందనా.. క్వారంటైన్ సెంటర్లో డీజే డాన్సులు

May 19, 2020

కరోనానా దాని బొందనా అన్నంత పనే చేశారు ఓచోట కరోనా రోగులు. దాని గురించిన చీకూచింతలు వదిలేసి ఎంచక్కా చిందులేశారు. డీజే సాంగ్‌లకు చప్పట్లు, ఈలలతో క్వారంటైన్ సెంటర్‌ను మారుమోగించారు. క్వారంటైన్ సెంటర్‌ను పబ్బులా మార్చేశారు. ఆశ్చర్యకర ఈ ఘటన బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలోని ఖరక్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. బయటి నుంచి వచ్చిన డ్యాన్సర్లు వేదిక మీద చిందులేశారు. వారిని చూస్తూ కింద ఉన్న రోగులు చప్పట్లు, తాళాలతో మాజా చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

అయితే ఇది అధికారుల దృష్టికి రావడంతో వారు సీరియస్ అయ్యారు. బయట నుంచి వచ్చిన వారిపై అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అడీషనల్ కలెక్టర్ బినయ్ కుమార్ వెల్లడించారు. కాగా, బీహార్‌లో మంగళవారం కొత్తగా 129 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 1,391కు చేరుకుంది. సివాన్‌లో అత్యధికంగా 29 కేసులు నమోదయ్యాయి.ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మంగళవారం నాటికి కరోనా సోకినవారిలో మొత్తం 494 మంది కోలుకోగా, 9 మంది మృతిచెందారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కేసుల సంఖ్యను బట్టి బీహార్ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది.