కేంద్ర కరెంట్ చట్టంతో ప్రమాదం.. కేసీఆర్ కన్నెర్ర  - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్ర కరెంట్ చట్టంతో ప్రమాదం.. కేసీఆర్ కన్నెర్ర 

September 15, 2020

Danger with Central new electricity Act .. CM KCR

కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పబట్టారు. ఈ చట్టం చాలా ప్రమాదమని అన్నారు. కేంద్రం తెచ్చే చట్టాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. విద్యుత్‌ సమస్యలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘కేంద్ర విద్యుత్‌ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి. నూతన చట్టం అమల్లోకి వస్తే కొత్త మీటర్ల కోసం రూ.700 కోట్లు కావాలి. మీటర్‌ రీడింగ్‌ పేరిట బిల్లులు ముక్కుపిండి వసూలు చేస్తారు. నా చిన్నప్పుడు బిల్‌కలెక్టర్‌‌ను చూస్తే రైతులు ఎంతో భయపడేవారు. కేంద్రం తెచ్చే ఈ చట్టంతో రాష్ట్రాలకు నియంత్రణ ఉండదు. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల అధికారాలు ఢిల్లీకి వెళ్తాయి. రాష్ట్రాల లోడ్‌ సెంటర్లు అన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్తాయి. దేశ ప్రజలు, రైతులపై పెనుభారం మోపే విధంగా ఉన్న విద్యుత్‌ బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు కేసీఆర్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. బిల్లు ఉపసంహరణ తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఇదిలావుండగా కరోనా కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్‌ బిల్లులు భారీగా రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.  లాక్‌డౌన్ సమయంలో మూడు నెలల విద్యుత్‌ బిల్లు కలిపి ఒకేసారి వేయడంతో తనకు రూ.55 వేల బిల్లు వచ్చిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని వివరించారు. దీనిపై కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. విద్యుత్‌ బిల్లుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో.. మూడు నెలలకు కలిపి కాకుండా, విభజించి విడిగా ఏ నెలకు ఆనెల బిల్లువేసి లోపాలు సరిదిద్దాలని ఈరోజే అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు.