11 ఏళ్ల బాలుడి నోటీసులు.. ఎన్నికలకు విఘాతం కలిగిస్తాడని! - MicTv.in - Telugu News
mictv telugu

11 ఏళ్ల బాలుడి నోటీసులు.. ఎన్నికలకు విఘాతం కలిగిస్తాడని!

October 13, 2020

DARBHANGA POLICE BOOKED A CLASS IV STUDENT.jp

ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు పాత నేరస్తుల జాబితాను సిద్ధం చేస్తారు. ఆ జాబితాలో ఉన్న వారికి ముందస్తుగా నోటీసులు ఇస్తారు. అలాగే పూచికత్తు కింద పారితో బాండ్‌పై సంతకం పెట్టించుకుంటారు. ఈ నేపథ్యంలో బీహార్ పోలీసులు అత్యత్సాహం ప్రదర్శించారు. త్వరలో జరుగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల శాంతి భద్రత కారణాల దృష్ట్యా నాలుగవ తరగతి చదువుతోన్న పదకొండేళ్ల బాలునికి నోటీసులు పంపించారు. స్టేషన్‌కి వచ్చి రూ. 50,000 వేల రూపాయల బాండ్‌పై సంతకం పెట్టాలని ఆదేశించారు. 

దీంతో ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ సంఘటన బీహార్‌లోని దర్బంగా మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగింది. ఆ బాలుడు సోమవారం బహదూర్పుర్ పోలీస్ స్టేషన్‌కి చేరుకోవడంతో ఈ సంఘటన మీడియాలో వచ్చింది. ఆ బాలుడితో పాటు అతడి తల్లి కూడా స్టేషన్‌కి వచ్చింది. ఒక్కసారి నేరస్తుల జాబితాలో ఉన్న పేర్లు, చిరునామాలను పరిశీలించాలని కోరింది. దీంతో అసలు విషయం బయటపడింది. వాస్తవానికి ఆ బాలుడి తండ్రి పేరుపై గతంలో కొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో నేరస్తుల జాబితా తయారుచేస్తున సమయంలో స్థానిక కానిస్టేబుల్ తండ్రి పేరుకి బదులు కొడుకు పేరు రాశాడు. దీంతో ఆ కుర్రాడి పేరుతో నోటీసులు వెళ్లాయి. పోలీసులు ఆ కుర్రాడి ఆధార్ కార్డు, స్కూల్ ఐడెంటిటీ కార్డును పరిశీలించి అతన్ని వదిలేశారు. ఇకపై వాంటెడ్ నేరస్తుల జాబితాను తయారు చేస్తున్న సమయంలో నేరస్తుల వయస్సు కూడా రాయాలని ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించారు.