దమ్ముంటే కాల్చరా.. ఈ పోలీస్ ధైర్యానికి సలాం.. - MicTv.in - Telugu News
mictv telugu

దమ్ముంటే కాల్చరా.. ఈ పోలీస్ ధైర్యానికి సలాం..

February 28, 2020

Deepak Dahiya.

తనవైపు దుండగుడు తుపాకీ గురిపెట్టినా బెదరలేదు ఆ పోలీస్ కానిస్టేబుల్. దుండగుడి గుండుకి గుండెను అడ్డుపెట్టిన ఆ కానిస్టేబుల్ ధైర్యం ఎంతోమందికి నచ్చుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోన్న ఢిల్లీ అల్లర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతని పేరు దీపక్ దహియా. అతని ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజమైన ఖాకీకి నిర్వచనంగా నిలిచారు అని వేనోళ్ల పొగుడుతున్నారు.  

ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపక్ ఆ రోజు జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. ‘మేమంతా రోడ్డుకు ఓ వైపు ఉన్నాం. ఇంతలో మరో వైపు నుంచి తుపాకీ శబ్దం రావడంతో అటువైపు దూసుకెళ్లాం. అక్కడికి వెళ్లి చూస్తే ఓ నిరసనకారుడు తుపాకీ గురిపెట్టి మా వైపు రాసాగాడు. నేను పక్కకు తప్పుకుంటే ఎవరో ఒకర్ని అతను కాల్చి చంపేస్తాడనే ఆలోచన కలిగింది. షారుక్‌ను బెదిరించడానికి చేతిలోని లాఠీ చూపించాను. ఒక్క అడుగు వెనక్కు వేయడానికి కూడా మనసు రాలేదు. దమ్ముంటే కాల్చమని ఎదురు నిల్చున్నా. రెండుసార్లు గాలిలోకి కాల్పులు జరిపాడు. ఒక గుండు నా తలకు రెండు అడుగుల దూరం నుంచి దూసుకుపోయింది. ఈ విషయం తెలిసి నాభార్య చాలా భయపడిపోయింది. మా నాన్న మాత్రం చాలా గర్వపడ్డారు. నీ డ్యూటీ నువ్వు చేశావ్.. ఇకపై ప్రజాశ్రేయస్సే నీ లక్ష్యం అన్నారు’ అని దీపక్ వివరించారు.