దసరా ఉత్సవాలు.. విభిన్న పద్దతులు - MicTv.in - Telugu News
mictv telugu

దసరా ఉత్సవాలు.. విభిన్న పద్దతులు

October 23, 2020

హిందువుల పండుగల్లో దసరా ముఖ్యమైన పండుగ. పదితలల రావణుణ్ణి.. రాముడు అంతమొందించిన ఈ పండుగను పది రోజులు జరుపుకుంటారు. చెడుపై మంచి గెలిచిన ఈ రోజుని దేశవ్యాప్తంగా ఒక్కో చోట ఒక్కో రకంగా జరుపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒడిషా, తెలంగాణ, విజయవాడ, ఖానాపూర్లలో భిన్న పద్దతులు ఉంటాయి. ఇవే కాక ఊరికో తీరు కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు.  అన్నింటిలో మైసూరు దసరా ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి. ఈ ఉత్సవాల గురించి దేశమంతా చర్చ జరుగుతుంది.

* మైసూరు దసరా ఉత్సవాలు

మైసూరులో రాజుల పాలన కాలం నుండి దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. మైసూరు మహారాజు కులదైవమైన చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగిస్తారు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా కళా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ వేడుక చూడడానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. దసరా సమయంలో మైసూరు రాజభవనాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అలాగే ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు జరుగుతాయి. మైసూరు దసరా ఉత్సవాల్లో ఏనుగుల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే మైసూరు రాజు ఆయుధ పూజ వైభవంగా జరుగుతుంది.

* తెలంగాణ దసరా ఉత్సవాలు

దసరా తొలి తొమ్మిది రోజులను తెలంగాణ ప్రజలు బతుకమ్మగా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ జరుపుకుంటారు. బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఒక చోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించింది.  దసరా రోజున జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటారు.  కరీంనగర్ బొగ్గు గనులు ఎక్కువగా ఉండే ప్రాంతం.   క్షత్రియుల ఆయుధ విన్యాసాలు పోలిన విన్యాసాలను ప్రదర్శిస్తారు. నరకాసుర వధ ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. హనుమాన్ అకాడా, దుర్గా అకాడాలను నిర్వహిస్తారు. దేవతల రూపాలను ఇనుప బెల్టు, త్రిశూలం మొదలైన ఆయుధాలను పట్టుకొని విన్యాసాలు చేస్తారు. కర్రసాము నిర్వహిస్తారు.

* ఆంధ్రప్రదేశ్ దసరా ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో పట్టణంలో ఒక్కోలా దసరా పండుగను నిర్వహిస్తారు. బెజవాడ కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రి తొమ్మిది రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి విజయదశమి నాటికి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడు సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాతబస్తీలో ఉరేగిస్తారు. 1వ టౌన్ పోలీసు స్టేషను వద్దకు రావడంతో ఊరేగింపు ముగిస్తుంది. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. 

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో దసరా సమయంలో సుమారు వంద సంవత్సరాల నుండి ఏనుగు సంబరాలు జరుపుతున్నారు. దసరా మొదటి రోజున ఏనుగుగుడిలో భేతాళుడిని నిలబెడతారు. తొమ్మిది రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు. 

విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడి తల్లికి పూజలు చేస్తారు. ఈ దేవికి దసరా వెళ్ళిన తరువాత మొదటి మంగళవారం నాడు జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజారిని సిరిమాను ఎక్కించి అమ్మవారి గుడి ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుండి కోట వరకు మూడు సార్లు ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూసేందుకు చుట్టు పక్కల పల్లెల నుంచి ప్రజలు ఎడ్లబండిలో మూడురోజుల ముందుగా వచ్చి రోడ్డు ప్రక్కన గుడారాలు వేసుకుని ఉత్సవం చూసి ఆనందిస్తారు. 

కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరా సమయంలో రాళ్ళయుద్ధం చేసుకుంటారు. దసరా రోజున సాయం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున కాలువకు అటూ ఇటూ చేరి కంకర రాళ్ళను గుట్టగా పోసుకుని ఒకవైపు రామసేన ఒకవైపు రావణ సేనగా ఊహించి రాళ్ళను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం యుద్దంచే విజయం చేసినట్లు భావిస్తారు. దీనిని వాళ్ళు రామ రావణ యుద్ధంగా అభివర్ణిస్తారు. 

దేవరగట్టు గ్రామంలో బన్ని ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మాలమల్లేశ్వరస్వామి విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 18 గ్రామాల ప్రజలు, దేవరగట్టు నెలవై ఉన్న రెండుగ్రామాల పరిధిలోని ప్రజలతో కొట్లాడతారు. స్వామిని తీసుకువెళ్లేందుకు ఓ వర్గం, తమ గ్రామంలోనే ఉండేలా చూసుకునేందుకు మరో వర్గం ఎదురుపడి   వెదురు కర్రలతో కొట్టుకుంటారు.

* కలకత్తా దసరా ఉత్సవాలు

బెంగాలీ ప్రజలు దసరాను దుర్గాపూజ పర్వదినంగా జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి రోజుల్లో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళికామాతను దర్శిస్తారు. లక్షల మందిని దర్శించుకుంటారు. తొమ్మిది రోజులూ రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆ రోజున నదీ తీరంలో కుమారీ పూజలు చేయడం బెంగాల్ ప్రజల ప్రత్యేకత.

* ఒడిషా దసరా ఉత్సవాలు

ఒడిషా ప్రజలు కూడా దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధుల్లో ప్రతిష్ఠిస్తారు. మహిళలు మానికలో వడ్లు నింపి లక్ష్మీ దేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. దీనిని వారు మాన బాన అంటారు. ఒడిషా ప్రజలు విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తారు. ఇలా చేస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని నమ్ముతారు. విజయ దశమి రోజున భారీ రావణ విగ్రహాన్ని బాణసంచాతో తయారు చేసి మైదానంలో కాలుస్తారు.

* గుజరాత్ దసరా ఉత్సవాలు

దసరా సమయంలో గుజరాతీ ప్రజలు పార్వతిదేవిని పూజిస్తారు. ఇంటింటా శక్తి పూజ చేస్తారు. ఇంటి గోడలపై శ్రీ చక్రం, త్రిశూలం, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు. ఆ గుర్తుల సమీపంలో పొలం నుండి తీసుకు వచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ, గోధుమ విత్తనాలను చల్లి మట్టి ఉండ పెట్టి దానిని నీటితో నింపుతారు. తరువాత అందులో పోకచెక్క, వెండి లేదా రాగి నాణెం వేస్తారు. ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తారు. దానిని కుంభీ ప్రతిష్ట అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున దానిని నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిసారు. తరువాత పౌర్ణమి వరకూ జరిగే గర్భా ఉత్సవాలలో నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో ప్రజలందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా నృత్యం చేస్తారు.