హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ తొమ్మిది రోజులు దుర్గామాతను ప్రతిష్టించి పూజిస్తారు. తెలంగాణలో తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడతారు.
అయితే.. పండగరోజు కూడా పాత చింతకాయ పచ్చడేనా? వద్దేవద్దు. నోటికి కూడ పండగ కవాల్సిందే. అందుకే పండగ అనగానే ఎవరికైనా వెంటనే పిండివంటలు గుర్తుకొస్తాయి. దసరా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇల్లు పిండి వంటలతో ఘుమఘుమలాడుతుంది. పిల్లాపాపలతో కేరింతలు కొడుతుంది. ప్రతి ఒక్కరి నోరు కొత్త రుచులు చూస్తుంది. దసర పండుగలో వందల రకాల పిండి వంటలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం. వాటి ఆరోగ్య ప్రయోజనను తెలుసుకుందాం..
* అరిసెలు
అరిసెలు లేని దసరను ఉహించుకోలేం. వీటినే కొన్ని చోట్ల అత్తిరాసలు, అప్పాలు అని కూడా అంటారు. బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠం. అరిసెల్లో ఉండే బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. వీటిలో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఐరన్‌తో పాటు పలు పోషకాలు శరీరానికి లభిస్తాయి. ఈ కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ అరిసెలు దోహదం చేస్తాయి.
* నువ్వుండలు
దసరా వంటకాల్లో నువ్వుల ఉండలు అతి బలవర్థకమైన ఆహారం. శీతాకాలంలో శరీరం పొడి బారిపోతూ ఉంటుంది. ఈ సమయంలో నువ్వులు ఆహారంగా తీసుకోవడం ద్వారా దానిలో ఉండే నూనె శరీరాన్ని కాంతిమంతంగా చేస్తుంది. బాలికల్లో రక్తహీనత నివారించడానికి ఉపకరిస్తుంది. శరీరంలో వేడి పుట్టించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. విటమిన్ ఎ, డి, ఇ, కెలు మనిషికి లభిస్తాయి. హార్మోన్ల స్థాయిని పెంపుదల చేసి దేహదారుఢ్యానికి దోహదపడుతుంది. తెలంగాణలో నువ్వులతో సత్తు పిండి చేసుకుంటారు. అందులో చెక్కర కలిపి తింటారు.
* కజ్జికాయలు
దీర్ఘకాలం నిల్వ ఉండే పిండి వంటకాల్లో కజ్జికాయలు ఒకటి. దీనిలో కొబ్బరి, రవ్వ, పంచదారతో పాటు యాలకులు, జీడిపప్పు వంటివి వినియోగిస్తారు. మనిషికి కావాల్సిన ప్రోటీన్స్, ఐరన్, ఖనిజ లవణాలు కజ్జికాయల ద్వారా మనుషులకు పుష్కలంగా అందుతాయి. వీటిని ఒక్కసారే ఎక్కువ మోతాదులో చేసుకుని నిల్వ ఉంచుకుని రోజు కొన్ని తింటూ ఉంటారు.
* గారెలు
గారెలు పిండి వంటల్లో రారాజు. ఎక్కువసార్లు ఎక్కువ మంది చేసుకునే పిండి వంటకం. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. రుచితో పాటు పోషకాలను అందిస్తాయి. అందుకే తింటే గారెలే తినాలి.. వింటే మహాభారతమే వినాలని పెద్దలు అంటూ ఉంటారు. బియ్యం పిండితో వీటిని చేస్తారు. వీటిని తినడం వల్ల శరీరానికి కార్బొహైడ్రేట్లు అందుతాయి.
* సున్ని ఉండలు
బలవర్థకమైన పిండి వంటకాల్లో సున్ని ఉండలు మొదటిస్థానంలో ఉంటాయి. వీటిని మినపపిండి, నెయ్యి, బెల్లంతో చేస్తారు. బెల్లానికి రక్తాన్ని శుద్ధిచేసే లక్షణం ఉంటుంది. సున్ను, నెయ్యి ద్వారా ప్రోటీన్లు, పలు రకాల పోషకాలు అందుతాయి. హోర్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి సున్నుండలు సహకరిస్థాయి. శృంగారశక్తిని పెంపొందించడంతోపాటు విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందించుకునేందుకు ఇవి ఎంతో దోహదం చేస్తాయి.