సాహిత్యకెరటం దాశరథి జోహార్... - MicTv.in - Telugu News
mictv telugu

సాహిత్యకెరటం దాశరథి జోహార్…

July 22, 2017

 

తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదకు ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కధనం..

పద్యాన్ని పదునైన ఆయుధంగా మలిచి తెలంగాణ విముక్తి కై ఉద్యమించిన సాహిత్యకెరటం దాశరథి..నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా చాటిన దాశరథి కృష్ణమాచార్యకు మైక్ టీవీ నివాళి.

గాయపడ్డ కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో…ఆ కవి కలమే కష్టాలు కన్నీళ్లను నింపుకుని కదమ్ తాల్ చేస్తే నియంతృత్వపు కోట గోడలు కూలుతాయి.సముద్రగర్భంలోని బడబాగ్నిలా సామాన్యుడి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది..నల్లటి ఆకాశాన్ని చీల్చుకుని వచ్చే సూర్యుడిలా అణిచివేత చీకట్లను పాతరేస్తూ స్వేఛ్చాకిరణం పురుడు పోసుకుంటుంది..నిప్పురవ్వల్లాంటి అక్షరాలతో కవిత్వమనే వాయిద్యం యుద్ధ నగారా మోగిస్తుంది..ఆ క్షణమే దిక్కులు దద్దరిల్లేలా దాశరథి కృష్ణమాచార్యుడి సాహిత్యం తిరుగుబాటు జెండా ఎగరేస్తుంది..తరతరలా బూజు దులుపుతుంది..

నా పేరు ప్రజాకోటి…నా ఊరు ప్రజావాటి అన్న ప్రళయకవితామూర్తి దాశరథి కృష్ణమాచార్యులు ఒకప్పటి వరంగల్ జిల్లా మరిపెడ మండలం చిన్నగూడురులో 1925 జులై 22 న జన్మించారు… దాశరథి బాల్యం మధిరలో గడిచింది..చిన్నతనంలోనే వేదాల్ని,ఇతిహాసాల్ని ఔపోసన పట్టారు..భగవద్గీత శ్లోకాల్నీ కంఠతా పట్టిన దాశరథి అశువుగా పద్యాలు చెప్పేవారు..పూజ సమయంలో సంస్కృతంలోనే మాట్లాడాలన్న తండ్రి ఆదేశాలు ఎంతో మంచి చేశాయి.అందుకే చిన్నతనంలోనే ఈజీగా పద్యాలు అల్లారు.. ఖమ్మంలో మెట్రిక్యులేషన్,భోపాల్ లో ఇంటర్మీడియట్ చదివిన దాశరథి.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ సాహిత్యంలో బీఏ పట్టా తీసుకున్నారు..సంస్కృతం, ఇంగ్లీష్, ఉర్దూ,పార్సీ భాషలపై కృష్ణమాచార్యుడికి మంచి పట్టుంది..

హైదరాబాద్ లో చదువుకుంటున్నప్పుడు ఆంధ్రమహాసభలో చేరిన దాశరథి..నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించారు.. ఊరూరూ తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేశారు..ఆంధ్రమహాసభ కమ్యూనిస్ట్ పార్టీగా మారాక కొంతకాలం అందులోనే ఉన్నారు..అయితే రెండవ ప్రపంచయుద్ద సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక…అందులో నుంచి బయటకువచ్చి రామానంద తీర్థ నాయకత్వంలో సాగుతున్న హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు..దొరల అరాచకత్వం, నిజాం నిరంకుశత్వ పాలనలో కన్నీళ్లు పెడుతున్న పేదబతుకుల రోదనలు దాశరథిని విప్లవకవిగా మార్చాయి.. ఆక్షరాల్ని ఆయుధాలుగా మలిచి నిజాంపై ఎక్కుపెట్టారు..తన కవితలతో నిజాం దుమ్ము దులిపారు..పద్యాలు, గేయాలతో తెలంగాణ ప్రజల గుండె చప్పుడును వినిపించారు

1947 లో దాశరథిని అరెస్ట్ చేసిన నిజాం సర్కార్……వరంగల్ సెంట్రల్ జైలులో ఉంచింది….అక్కడి నుంచి నిజామాబాద్ కు తరలించింది..వట్టికోట ఆళ్వార్ స్వామితో పాటు మరో 150 మంది తెలంగాణ ఉద్యమకారులతో కలిసి దాశరథి జైలు శిక్ష అనుభవించారు..ఓ నిజాం పిశాచమా..కానరాడు నిను బోలిన రాజు మాకెన్నెడేని అని జైలు లోపల కూడా గద్దించారు..నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించారు…ఆయన చెప్పే పద్యాలను బొగ్గు తో జైలుగోడలపై వట్టికోట రాసేవాడు..ఆ కవితల సంకలనమే అగ్నిధార…జైలులో ఆ పద్యాలను కంఠస్తం చేసి జాతికి అందించిన వట్టికోటకే అగ్నిధారను అంకితమిచ్చారు దాశరథి..

అగ్నిధార అచ్చుకాకముందే అందులోని పద్యాలు తెలంగాణలో ప్రతిధ్వనించాయి…1949లో ఇల్లందులో జరిగిన ఒక సభలో ఆయనకు మహాకవి అన్న బిరుదును ప్రధానం చేశారు..మహాంద్రోదయం,రుద్రవీణ,మార్పు నా తీర్పు, ఆలోచనాలోచనాలు,ధ్వజమెత్తిన ప్రజల,కవితా పుష్పకం,తిమిరంతో సమరం కవితా సంపుటాలు దాశరథి కలం నుంచి జాలువారినవే…ఇందులో కవితా పుష్పకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డ్ వస్తే…తిమిరంతో సమరంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ దక్కింది..ఇవే కాదు అరబ్బీ సాహిత్య విలక్షణ ప్రక్రియ రుబాయీని తెలుగులో ప్రవేశపెట్టారు..అట్లనే దాశరథి చేసిన మరో  ప్రయోగం గజల్…క్లుప్తత,గాఢతే గుణాలుగా ఉండే గజల్ ప్రక్రియమీద కొన్నేళ్లపాటు దాశరథి పరిశోధనలు చేశారు..గజల్ జీవ లక్షణాన్ని పదిలంగా కాపాడుతూ మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్లను గాలిబ్ గీతాలుగా తెలుగులోకి అనువదించారు..

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చాటిన దాశరథి సినిమా సాహిత్యాన్ని కూడా రాశారు…1961లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఇద్దరు మిత్రులు చిత్రంతో గేయ రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు..ఖుషీ ఖుషీగా నవ్వుతూ పాటతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు…చిన్నచిన్న పదాలతో,ద్వంద్వార్థాలు లేకుండా స్వచ్ఛమైన తెలుగులో ఆయన రాసిన ఎన్నో పాటలు…ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యాయి…

సానబెట్టిన కత్తుల్లాంటి పదునైన పద్యాలని రాసిన దాశరథి….పద్యమనే కత్తికి రెండు వైపులా పదునే అని నిరూపించారు..సముద్రంలేని తెలంగాణకు కవితా సంద్రాన్ని ఇచ్చిన మహాకవిని ఎన్నో అవార్డులు, బిరుదులు వరించాయి..1975లో ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపుర్ణ బిరుదుతో సత్కరించింది.. ఆగ్రా విశ్వ విద్యాలయం 1976లో,ఎస్వీ యూనివర్సిటీ 1981లో దాశరథికి గౌరవ డాక్టరేట్ ఇచ్చాయి…

పేదరికాన్ని అనుభవించి వెలకట్టలేని సాహిత్య సంపదను తెలంగాణకిచ్చిన దాశరథిపై సీమాంధ్ర సర్కార్ కక్ష కట్టింది..నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్…ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా ఉన్న కృష్ణమాచార్యున్ని ఆ పదవి నుంచి తొలగించి ఘోరంగా అవమానించారు..ఆ బాధతోనే 1987 నవంబర్ 5 న దాశరథి చనిపోయారు

నిప్పులోంచి అప్పుడప్పుడు పొగపుడుతుంది..నీటిలోంచి విద్యుత్తను సెగ పుడుతుంది..ఈ దానవలోకంలో ఎన్నటికైనా మానవులని పిలవదగిన తెగ పుడుతుందన్న దాశరథి..తెలంగాణ ప్రజల ఆరాటపోరాటాల్లో అమరుడిగా ఉన్నారు…