దాసరి శకం ముగిసింది. - MicTv.in - Telugu News
mictv telugu

దాసరి శకం ముగిసింది.

May 30, 2017


తెలుగు ఇండస్ట్రీలో దర్శక రత్న దాసరి నారాయణరావు శకం ముగిసింది. 151 సినిమాలకు దర్శకత్వం, దాసరి తెలుగుసినీ చరిత్రలో ట్రెండ్ సెట్టర్. 53 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం… దాసరి నారాయణరావు… ఇదీ తెలుగు సినిమా రంగంలో దాసరి విశ్వరూపం. తెర వెనుక ఉండే దర్శకుడికి హీరో స్టేటస్‌ తీసుకొచ్చింది ఆయనే. తన గురు పీఠానికి గ్లామర్‌ తీసుకురావడమే కాదు… ఎందరికో ఈ గ్లామర్‌ ప్రపంచంలో గాడ్‌ఫాదర్‌గా నిలిచారు.” సినీ పరిశ్రమలో అందరి జాతకాలు నాకు తెలుసు.. అందుకే నేనేదన్నా ఎవరూ ఎదురు చెప్పరు’’ అని దాసరి నిర్మోహమాటంగా ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. గతంలో పత్రికాధిపతిగా ఉన్నా.. ఈ రోజు రాజకీయాల్లో ఉన్నా.. తన శాశ్వత చిరునామా సినిమాగా మార్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మే 4, 1942లో జన్మించిన దాసరి తాతా మనుమడు సినిమాతో దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సుప్రసిద్ధ నటీనటులకు హిట్ చిత్రాలనందించారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు.