సమస్య, పరిష్కారం రెండూ ఆయన వద్దే ఉన్నాయి : దాసోజు శ్రవణ్ - MicTv.in - Telugu News
mictv telugu

సమస్య, పరిష్కారం రెండూ ఆయన వద్దే ఉన్నాయి : దాసోజు శ్రవణ్

April 11, 2022

hfbfc

అన్నదాతను పావుగా వాడుకొని తెలంగాణను మూడోసారి కబళించేందుకు పన్నిన కుట్రలో భాగంగా సీఎం కేసీఆర్ దొంగ దీక్షలు చేస్తున్నారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం, రాష్ట్రం మధ్య ధాన్యం కొనుగోలు అంశంపై జరుగుతున్న వివాదంపై ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు. ఆయన మాటల్లోనే.. ‘ రంగస్థలం సినిమాలో రాత్రి కొడుకులను చంపి తెల్లారాక దండతో తల్లిదండ్రులకు సంతాపం తెలిపే విలన్ జగపతిబాబు పాత్రలా కేసీఆర్ మారారు. రైతులు తమ పంటను దళారులకు అమ్మేలా కుట్ర చేసి, ఇప్పుడు రైతుల తరపున దీక్ష చేస్తున్నానని చెప్తున్నారు. టీఆర్ఎస్ ఢిల్లీలో, బీజేపీ రాష్ట్రంలో ధర్నాలు చేస్తే రైతులను ఎవరు ఆదుకుంటారు? ఉప్పుడు బియ్యం ఇవ్వనని కేసీఆర్ మోడీకి రాసిచ్చారు. ఎవరైనా వరి వేస్తే ఉరి వేస్తామని ఐఏఎస్ అధికారులతో బెదిరించారు. ఇప్పుడేమో ఇద్దరూ రైతులకు మొండి చేయి చూపుతున్నారు.

రా రైస్ ఇస్తే వెయ్యి కోట్ల నష్టం వస్తుంది. ధనిక రాష్ట్రంలో కేసీఆర్ రైతుల కోసం ఆమాత్రం భరించలేరా? లేదా కేంద్రం భరించి రైతులను ఆదుకోలేవా? ఈ పని చేయకుండా చిల్లర డ్రామాలు ఆడుతున్నారు. ఢిల్లీలో రాకేశ్ టికాయత్‌ను వాడుకున్నారు. ఆయన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసన తెలిపినప్పుడు కేసీఆర్.. మోదీతో కలిసి రైతు చట్టాలకు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ఆయన్ను పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే ఇందిరాపార్కు వద్ద, ఢిల్లీలో దీక్షలు అవసరం లేదు. సమస్యకు కారణం కేసీఆర్, పరిష్కారం కూడా ఆయన వద్ద ఉంది.

గతంలో ఇలాగే ఆర్టీసీ, మన్రేగా ఫీల్డ్ అసిస్టెంట్లు, సింగరేణి కార్మికులు, పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఎంతో కష్టనష్టాలు అనుభవించిన తర్వాత చివర్లో కేసీఆర్ తానేదో దానకర్ణుడిలా నజరానా ప్రకటించారు. ఇప్పుడు రైతుల విషయంలో అదే జరగబోతుంది. మోడీ కొనలేదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి నేనే కొంటా అని ప్రకటిస్తారు. నిజానికి ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని ఎవ్వరినీ సంప్రదించకుండా సంతకం చేసింది కేసీఆరే. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇదికాక, రాజకీయాలను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్‌లా మార్చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే బదులు పెద్ద పెద్ద వేదికలు, మైక్ సెట్లు, జనాల సమీకరణలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. రైతులతో డ్రామాలు ఆపి ఐకేపీ సెంటర్లు పెట్టి ప్రతీ ధాన్యం గింజ కొనేలా చర్యలు తీసుకోవాల’ని  కోరారు.