Dasoju Sravan Kumar Joins in BJP Today In Delhi
mictv telugu

బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్.. ఎంపీ టికెట్‌పై హామీ

August 7, 2022

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌కుమార్ ఆదివారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి సమక్షంలో రాష్ట్ర బీజేపీ ఇంఛార్జి తరుణ్‌ఛుగ్ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేసిన దాసోజు శ్రవణ్.. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెంది.. శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా ప్రకటన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి శనివారం ఢిల్లీకి వెళ్లి తరుణ్‌ ఛుగ్‌తో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీలో చేరిన దాసోజ్ శ్రవణ్ కు వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆ పార్టీ పెద్దల నుంచి హామీ లభించిందని తెలిసింది. శనివారం ఉదయం తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో కలిసి ఢిల్లీకి వెళ్లిన దాసోజు.. తరుచ్ చుగ్ తో సమావేశమయ్యారు. కాని పార్టీలో చేరలేదు. ఆదివారం ఉదయం జాయిన్ అయ్యారు. తనకు పార్టీలో ఎలాంటి అవకాశాలు ఉంటాయన్న దానిపై బీజేపీ పెద్దలతో చర్చల కోసమే శనివారం చేరిక జరగలేదంటున్నారు. ఎంపీ టికెట్ పై కమలం అగ్ర నేతల నుంచి శ్రవణ్ కు హామీ వచ్చిందని తెలుస్తోంది. ఇక పార్టీలో చేరిన తర్వాత దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశానని గుర్తుచేసుకున్న ఆయన.. ఇప్పుడు సొంతింటికే వచ్చి అనుభూతిని పొందుతున్నానన్నారు. తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్నానని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు దొరల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చేశాడని ఆరోపించారు. ఎనిమిదేళ్ల కాలంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేయలేదని, ఉద్యోగ నియామకాలు పూర్తిచేయలేదని మండిపడ్డారు.