Dasoju Sravan resign to BJP..What Next?
mictv telugu

జంపింగ్ జపాంగ్…రివర్స్ గేర్..దాసోజు శ్రవణ్ బాటలో ఇంకెందరు..?

October 21, 2022

Dasoju Sravan resign to BJP..What Next?

మునుగోడు ఉప ఎన్నికకు ముందు బీజేపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. కమలానికి క్యూ కట్టిన నేతలు ఒక్కొక్కరుగా రివర్స్ గేర్ వేస్తున్నారు. నిన్న మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ గులాబీ కండువా కుప్పుకున్నారు. ఇప్పుడు దాసోజ్ శ్రవణ్ ఇదే బాటలో నడిచారు. తిరిగి తిరిగి దాసోజు శ్రవణ్ తెలంగాణభవన్ కే చేరుకున్నారు. ఏక్ దం స్పీడ్ తో బీజేపీలోకి వెళ్లిన నేతలకు ఏమైంది?కొన్ని నెలల్లోనే తిరిగి ఎందుకు వెనక్కి వస్తున్నారు. వలస నేతలకు బీజేపీలో ప్రయారిటీ ఇవ్వడం లేదా?

ఎంత స్పీడ్ గా వెళ్లారో..అంతే స్పీడ్ గా వెనక్కి…

గత ఆరునెలల్లో తెలంగాణ బీజేపీలోకి వలసలు బాగా పెరిగాయి. టీఆర్ఎస్ , కాంగ్రెస్ లో తమకు సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదని భావించిన నేతలు కమలం కండువా కప్పుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికతో ఆపరేషన్ లోటస్ మరింత ఊపందుకుంది. చాలా మంది కీలక నేతలు టచ్ లో ఉన్నారన్న బీజేపీ నేతలు..వచ్చిన వారిని వచ్చినట్టు చేర్చుకుంటున్నారు. కానీ వీరి అంచనాల్ని తలికిందులు చేస్తూ వలస నాయకులు ఝలక్ ఇస్తున్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. శుక్రవారం దాసోజ్ శ్రవణ్ వంతు వచ్చేసింది. రెండు నెలల క్రితం కాంగ్రెస్ ని వీడిన దాసోజు శ్రవణ్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు బనిస బతుకు బతకలేనంటూ కాంగ్రెస్ కటీఫ్ అయ్యారు. ఇప్పుడు బీజేపీపై విమర్శలు సంధిస్తూ పదునైన విమర్శలతో లేఖ రాశారు.

దాసోజ్ శ్రవణ్ లేఖలో…

తెలంగాణ బీజేపీలో అనిశ్చితమైన పరిస్థితి ఉందని, పార్టీకి దశ దిశ లేదని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మునుగోడులో డబ్బులు, మందు పంచి గెలువాలని చూస్తున్నారన్నారు. బీజేపీలో పెట్టుబడి రాజకీయాలు కొనసాగుతున్నాయని బలహీన వర్గాల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని శ్రవణ్ ఆరోపించారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామన్న బీజేపీ…మునుగోడులో జుగుప్సాకరమైన పనులు చేస్తుందన్నారు. ఆగస్టులో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన దాసోజు… అక్టోబర్ లో బైబై చెప్పారు.

బీజేపీలో ఏం జరిగింది?
నిజానికి దాసోజు శ్రవణ్ చేసిన ఆరోపణలకు ఏ పార్టీ అతీతం కాదు. అన్ని పార్టీల్లో ఇలాగే జరుగుతోంది. టీఆర్ఎస్ , కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన దాసోజు శ్రవణ్ కు బీజేపీ అంతగా ప్రయారిటీ ఇవ్వలేదు. అతన్ని పెద్దగా ఉపయోగించుకున్న సందర్భాలు లేవు. అధికార ప్రతినిధిగా టీఆర్ఎస్ , కాంగ్రెస్ లో శ్రవణ్ ఎప్పుడూ మీడియాలో కనిపించారు. కమలంలోకి వెళ్లాక దాదాపు ఫేడ్ అవుట్ అయిపోయారు. లోలోపల మదనపడుతుండగా టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు జై కొట్టారు. భిక్షమయ్య గౌడ్ ది కూడా ఇలాంటి పరిస్థితే.

గులాబీ మాజీలపై ఆకర్ష అస్త్రం

మునుగోడు వేళ ఆపరేషన్ ఆకర్ష్ ని టీఆర్ఎస్ స్పీడప్ చేసింది. వీళ్లే కాదు..మిగతా వాళ్లను టీఆర్ఎస్ టచ్ చేస్తోంది. తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వామిగౌడ్ తో పాటు ఇంకొందరు నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మునుగోడు పోలింగ్ వరకు వీలైనంతమందిని కారెక్కించాలని ప్లాన్ చేస్తోంది.బీజేపీ ఊహించని విధంగా దెబ్బకొట్టాలని వ్యూహాలు రచిస్తోంది.

Dasoju Sravan resign to BJP..What Next?

రివర్స్ గేర్ తో బీజేపీ డీలా..!

తెలంగాణలో చాలా మంది నేతలు బీజేపీవైపు చూస్తున్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నయం బీజేపీ అంటూ..మంచి భవిష్యత్ ఉంటుందంటూ ఆ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. కొందరు ఇప్పటికే చేరారు. ఇంకొందరు చేరే ఆలోచనలో ఉన్నారు. కానీ ఈలోపే రివర్స్ గేర్ కమలం నేతలకు షాక్ ఇస్తోంది. అదీ మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఒక్కొక్కరుగా పార్టీ చేజారడాన్ని కమలాన్ని కంగారుపెడుతోంది.సెమీస్ గా భావిస్తున్న మునుగోడులో గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగరేయాలనుకుంటున్న బీజేపీకి జంపింగ్ జపాంగ్ రివర్స్ షాక్ లు ఇస్తుంది. వివిధ పార్టీల నుంచి నాయకుల్ని చేర్చుకుంటున్న తెలంగాణ బీజేపీ వారికి తర్వాత సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పార్టీలో పనులు అప్పచెప్పడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. ఇదే వలస నేతలకు చిరాకు తెప్పిస్తుంది. ఏదో ఊహించి చేరితే ఇలా ఉందేంటి రా బాబు అనుకుంటున్నారట..సరిగ్గా ఇలాంటి నాయకులపై టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. చూడాలి దాసోజు శ్రవణ్ బాటలో ఇంకెందరు వెళ్తారో…