కూతురికి వెలకట్టలేని కట్నం.. ఎడ్లబండి నిండా..  - MicTv.in - Telugu News
mictv telugu

కూతురికి వెలకట్టలేని కట్నం.. ఎడ్లబండి నిండా.. 

February 14, 2020

Father.

కట్నం చట్టపరంగా నిషేధం. అయితే చట్టానికి తూచ్ కొట్టేసి కట్నాలు ఇచ్చేసేవాళ్లు, పుచ్చుకునేవాళ్లు కోట్లలో ఉన్నారు. కట్నం కింద డబ్బులు, బంగారం, బంగ్లాలు ఇస్తుంటారు. కానీ ఓ తండ్రి మాత్రం అత్తారింటికెళ్తున్న తన కూతురికి పెళ్లి కానుకగా.. నిజంగానే బండెలు పుస్తకాలు ఇచ్చేశాడు. 

గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన కిన్నరిబా జడేజాకు చిన్నప్పుటి నుంచే పుస్తకాల పురుగుగా పేరుంది. తండ్రి హర్దేవ్ సింహ్ జడేజానే చిన్నప్పటినుంచి ఆమెకు పుస్తకాలు చదివే అలవాటు చేశారు. ఈ నేపథ్యంలో కుమార్తె పెళ్లీడుకొచ్చింది. ఎవరైనా తండ్రిని అంత బంగారం కావాలి.. ఇన్ని పట్టు చీరలు కావాలి అని కోరుతారు. కానీ ఆ కుమార్తె మాత్రం తండ్రిని కేవలం పుస్తకాలే కావాలని కోరింది. తన పెళ్లికి తాను ఎంత బరువుంటే అంత తూకం వచ్చే విధంగా బుక్స్ కావాలని తండ్రికి చెప్పింది. దీంతో తండ్రి కుమార్తె కోరినంత కాకుండా ఇంకా ఎక్కువ పుస్తకాలు బహూకరించి ఆమెని ఆశ్చర్యానందానికి గురిచేశారు. కుమార్తె ముందు పెళ్లి రథంపై వెళ్తంటే.. వెనుక ఎడ్లబండిలో 2200 పుస్తకాలను నింపి ఊరేగింపుగా తీసుకొచ్చి అందించారు. ఇందుకోసం ఆ నాన్న 6 నెలల పాటు కష్టపడ్డారు. తండ్రి కానుకను చూసి ఆ పెళ్లి కుమార్తె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.